గుజరాత్‌: ఆప్‌కు జాతిరత్నం షాక్‌.. ప్రజాభిష్టం మేరకే బీజేపీలో చేరతా!

12 Dec, 2022 09:16 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తామని ప్రకటించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి షాకే తగిలింది. తొంబై సీట్లు సాధిస్తామని ధీమాగా ప్రకటించుకున్న ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బే పడింది. కేవలం ఐదు స్థానాలతో  సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితమైంది గుజరాత్‌లో. అదే సమయంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోరంగా చతికిల బడింది. అయితే.. 

గుజరాత్‌ బీజేపీ భారీ విజయానికి.. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆప్‌లో కొనసాగుతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భూపత్‌ భయానీ.. తాజాగా షాకింగ్‌ ప్రకటన చేశారు. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు తెర మీదకు రావడంతో.. మీడియా ఆయన్ని ప్రశ్నించింది. అయితే తాను ఇంకా ఏం నిర్ణయించుకోలేదని ప్రకటిస్తూనే.. పార్టీ మారే అంశంపై హింట్‌ ఇచ్చారాయన. 

బీజేపీలోకి వెళ్లే విషయమై ఇంకా అధికారికంగా ఏం ఆలోచించుకోలేదు. కానీ, ప్రజలు గనుక కోరుకుంటే ఆ పని చేస్తా అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ‘‘ తన పార్టీకి నెగ్గిన వాళ్లంతా మేలిమి రత్నాలని, ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోరు’’ స్టేట్‌మెంట్‌ను తెర మీదకు తెచ్చి ట్రోలింగ్‌ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై భయానీ ఓ జాతీయ ఛానెల్‌ ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. 

ఆప్‌ను వీడే ఆలోచన లేదు. బీజేపీలో చేరను. ఒకవేళ బీజేపీలో చేరాలా? వద్దా? అని ప్రజలను కోరతా అని మాత్రమే చెప్పాను. అలా అనడానికి కారణం ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్య ఎలాగూ లేదు. ఎమ్మెల్యేగానూ నేను పెద్దగా ప్రభావం చూపించకపోనూ వచ్చు. తద్వారా ప్రజలకు ఏమీ ఒరగదు. నేను  నెగ్గిన స్థానంలో రైతుల సంఖ్య ఎక్కువ. ఇరిగేషన్‌ సంబంధిత సమస్యలే పరిష్కరించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఉన్నారు. వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోతే ఎలా?. అందుకే ప్రజలను, స్థానిక నేతలనూ ఓసారి సంప్రదిస్తా అంటూ పార్టీ మారే అంశంపై స్పందించారు. 

గతంలో బీజేపీలోనే ఉన్న భూపత్‌ భయానీ.. ఎన్నికల సమయంలో రెబల్‌గా మారారు. ఆప్‌లో చేరి జునాగఢ్‌ జిల్లా విసవాదర్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. ‘‘నరేంద్ర మోదీకి, బీజేపీకి గుజరాత్‌ ప్రజలు భారీ సీట్లతో అధికార పట్టం కట్టారు. బీజేపీ అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉండేది కాబట్టి. బహుశా అక్కడి జనాలు బీజేపీ ఎమ్మెల్యేగా నేను చేసిన సేవలు గుర్తించి నాకు ఓట్లేసి ఉంటారేమో అంటూ పార్టీ మారే దిశగా సంకేతాలు ఇచ్చారాయన. 

పార్టీ మారితే.. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా చర్యలు ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజల కోసం పని చేయడమే ఉంటుందంటూ వ్యాఖ్యానించారాయన. మొత్తం 182 సీట్లున్న గుజరాత్‌లో.. 156 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ ఐదు  స్థానాలు దక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు