‘హీ నితీష్డ్‌ మీ’

30 Jan, 2024 06:07 IST|Sakshi

బిహార్‌ సీఎంపై  వెల్లువెత్తుతున్న మీమ్స్, జోక్స్‌

న్యూఢిల్లీ: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పదేపదే కూటములు మార్చడంపై సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్‌ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని మీమ్స్‌లో కొన్ని...
 
‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్‌ మీ’ అంటూ పలువురు ట్యాగ్‌ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫార్మాట్‌ తేనుంది. అదేంటంటే మ్యాచ్‌ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్‌ కప్‌ లాగా అది ‘నితీశ్‌ కప్‌’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్‌’లో ట్వీట్‌చేశారు. కార్పోరేట్‌ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్‌ కుమార్‌ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్‌ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్‌ ట్వీట్‌చేశారు.

కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు.
‘‘జాతీయ రహదారులపై యూటర్న్‌ గుర్తు తీసేసి అక్కడ నితీశ్‌ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్‌చేశారు.
బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్‌ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు.  
1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి.
2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి.
3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి.
4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి.
5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి.

 
గవర్నర్‌ బిత్తరపోయిన వేళ!
ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్‌భవన్‌కు రావడం చూసి గవర్నర్‌ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. అదేమంటే, రాజ్‌భవన్‌లో మర్చిపోయిన తన మఫ్లర్‌(స్కార్ఫ్‌)ను తీసుకోవడం కోసం నితీశ్‌ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్‌ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్‌బై చెప్పడానికి నితీశ్‌కు 18 నెలలు టైమ్‌ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్‌ షాక్‌కు గురయ్యారంటూ కాంగ్రెస్‌ వ్యంగ్యంగా ట్వీట్‌చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్‌ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్‌ గయారామ్‌ బదులు ఇక ఆయా నితీశ్‌ గయా నితీశ్‌ అనుకోవాలి’’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు