దారుణం: 12 ఏళ్లుగా ఆమెకు ఇల్లే జైలు

2 Feb, 2024 17:16 IST|Sakshi

బెంగళూరు: శాస్త్రసాంకేతికతతో మనిషి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న కాలం మనదని చెబుతాం. స్త్రీలు సగర్వంగా తిరిగగలిగే సమాజంలో ఉన్నామని అనుకుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన ఓ ఘటనను చూస్తే అవన్నీ ప్రసంగాలకే పరిమితమవుతున్నాయా? అని ప్రశ్నించుకోకతప్పదు! కర్ణాటకాలో ఓ మహిళకు పుష్కరకాలంగా ఇల్లే కారాగారంగా మారింది.

కర్ణాటకాలోని మైసూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా ఓ అనుమానపు భర్త తన భార్యను ఇంట్లోనే బంధించాడు. భర్త పనికి వెళ్లే ముందు తనను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళతాడని మహిళ(32) పోలీసులకు తెలిపింది. మరుగుదొడ్డి కోసం ఇంట్లో చిన్న బాక్స్‌ను ఉపయోగించానని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చినా భర్త ఇంటికి వచ్చేవరకు లోపలికి అనుమతి ఉండదని తెలిపింది. కిటికీ నుంచే పిల్లలకు భోజనం అందిస్తానని కన్నీరు పెట్టుకుంది.

‘‘నాకు పెళ్లయి 12 ఏళ్లైంది.. నన్ను ఎప్పుడూ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ ప్రాంతంలో ఆయన్ని ఎవరూ ప్రశ్నించరు. నా పిల్లలు స్కూల్‌కి వెళతారు. కానీ నా భర్త పని నుంచి వచ్చే వరకు బయటే ఉంటారు. నేను వారికి కిటికీలోంచి ఆహారం ఇస్తాను. నా తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో కూడా సరిగా గుర్తులేదు." అని పోలీసులకు మహిళ  తెలిపింది. అయితే.. భర్తపై కేసు పెట్టడానికి మాత్రం బాధిత మహిళ ఇష్టపడలేదు. తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటానని పోలీసులకు తెలిపింది. అక్కడి నుంచే వివాహ సమస్యలను పరిష్కరించుకుంటానని పేర్కొంది. 

భర్తకు బాధిత మహిళ మూడో భార్య. గత మూడు వారాలుగా ఆమె ఇంట్లోనే ఉండటం గమనించామని పోలీసులు తెలిపారు. ఆమె కదలికలపై పూర్తి నిషేధం ఉంచినట్లు గుర్తించామని వెల్లడించారు. పనికి వెళ్లే ముందు ఆమెను ఇంట్లో ఉంచే తాళం వేయడం తాము గమనించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను రక్షించామని, తల్లిదండ్రుల వద్దకే మహిళ వెళ్లడానికి ఇష్టపడినట్లు తెలిపారు. భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్‌

whatsapp channel

మరిన్ని వార్తలు