హైదరాబాద్‌లో ‘రిసార్ట్‌’ పాలిటిక్స్‌.. జాలీగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు

2 Feb, 2024 19:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. 

జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు హైదరాబాద్‌ క్యాంపులో జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఆపరేషన్‌ జార్ఖండ్‌ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు ఏఐసీసీ అప్పగించింది.

కాగా, నిన్న మధ్యాహ్నం నుంచే జార్ఖండ్‌ రాజకీయ అలజడి ప్రారంభం కాగా, హైదరాబాద్‌లో గురువారం రాత్రే జడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్‌ పేరిట రూమ్‌లు బుక్‌ అయ్యాయి. హైదరాబాద్‌ క్యాంపునకు జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు చేరుకోవడంతో ఇంద్రవెల్లి పర్యటన నుంచే ఎప్పటికప్పుడు రేవంత్‌ టచ్‌లో ఉన్నారు. రాత్రికి జార్ఖండ్‌ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది.

మరోవైపు.. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపయ్‌ సోరెన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్‌ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం

whatsapp channel

మరిన్ని వార్తలు