కర్ఫ్యూల వల్ల ప్రయోజనమేంటి.. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ విధించండి: ఐఎంఏ

8 May, 2021 23:13 IST|Sakshi

కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది: ఐఎంఏ

దేశం మొత్తం లాక్‌డౌన్ విధించాలన్న ఐఎంఏ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ

రాత్రి కర్ఫ్యూల వల్ల ప్రయోజనంలేదని వెల్లడి

తమ సూచనలు పట్టించుకోలేదని ఆరోపణ

వ్యాక్సినేషన్ కు ప్రణాళిక లోపించిందని విమర్శలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. తాము కేంద్రానికి అందించిన సలహాలు, సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమైందని వెల్లడించింది. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని, 18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అని నిలదీసింది. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ లోపభూయిష్టమని విమర్శించింది.

సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ముందుకు సాగడంలేదని ఆరోపించింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇకనైనా మేల్కోవాలని, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ఐఎంఏ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం అవుతుందని, అంతేకాకుండా, కరోనా రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది.

>
మరిన్ని వార్తలు