ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ

9 May, 2021 00:07 IST|Sakshi

సందర్భం

ఇటీవల మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్‌ విజయం, కేరళలో విజయన్‌ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి  పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం అపూర్వమైంది.

బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్‌లో మోహరించినా బెంగాల్‌ టైగర్‌ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్‌ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయ పరంపర నిరూపిస్తుంది.

రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్‌. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్‌ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు.  ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది.

కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్‌ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది.

అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్‌ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్‌ ఎన్నికలు రుజువు చేశాయి. 

అలానే వైఎస్సార్‌సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్‌ గత రెండేళ్లుగా వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు.


డా. కాలువ మల్లయ్య 
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
మొబైల్‌: 91829 18567

మరిన్ని వార్తలు