IMD Issued Warning: మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!

14 Dec, 2023 08:03 IST|Sakshi

దేశంలోని పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మైదానాలను చల్లని గాలులు చుట్టుముడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలుచోట్ల ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, త్రిపుర, యూపీలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 14, 15 తేదీల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 14న అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ ఇదే విధమైన హెచ్చరిక జారీ చేసింది. 

గడచిన 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో 6 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంది. మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తిరిగి పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నగరంలోని గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైంది.

డిసెంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17న కేరళలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో మంచు కురుస్తోంది. గడచిన 24 గంటల్లో హిమాచల్‌లోని కులు, కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వత శ్రేణులలో మంచు కురిసింది. 
ఇది కూడా చదవండి: సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్‌లో చాయ్‌ ఫ్రీ!

>
మరిన్ని వార్తలు