Omidyar Network India : భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న మరో దిగ్గజ కంపెనీ.. కారణం అదే!

13 Dec, 2023 18:37 IST|Sakshi

భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్‌సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో, మెట్రో వంటి సంస్థల బాటలోనే తాజాగా అమెరికా పెట్టుబడుల దిగ్గజం ఒమిడియార్ నెట్‌వర్క్ చేరింది.

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం ఒమిడియార్ నెట్‌వర్క్ భారత్‌కు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాదిలో ఆ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యల్ని ముమ్మరం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈకామర్స్‌ సంస్థ ఈబే ఫౌండర్లు పియర్ ఒమిడ్యార్, పామ్ ఒమిడ్యార్‌లు..భారత్‌ కేంద్రంగా ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌ ఇండియా పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ఎంటర్‌ ప్రైజెస్‌ విభాగాల్లో వ్యాపారాలు చేసే సంస్థలకు పెట్టుబడులు పెడుతుంది. దీంతో పాటు స్వచ్ఛంద సంస్థలకు, డ్యూ యల్‌ చెక్‌ బుక్‌ అనే మోడల్‌ పేరుతో ఇన్నోవేటీవ్‌ ఆంత్రప్రెన్యూర్‌లకు,సెక్టార్‌ లెవల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల కంపెనీలకు నిధులు సమకూర్చుతుంది. ఏదైనా కంపెనీ చట్టపరమైన అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటే.. దేశీయ చట్టాల్ని అనుసరిస్తూ వాటి నుంచి ఎలా భయటపడాలో సలహా ఇస్తుంది.

పెట్టుబడులు నిలిపివేస్తూ
ఈ తరుణంలో ఒమిడియార్ నెట్‌వర్క్ వచ్చే ఏడాది చివరి నాటికి భారత్‌ను వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఇప్పటికే ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఒమిడియార్‌ యాజమాన్యం, బోర్డ్‌ సభ్యులు వచ్చే రెండు నెలల్లో ప్రస్తుతం ఒప్పందం కుదర్చుకున్న సంస్థలతో కొనసాగింపు, పోర్ట్‌పోలియో వంటి అంశాలపై వ్యూహరచన చేయనుంది. ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌ భారత్‌ను ఎందుకు వదిలి వెళ్తుందనే విషయంపై ఎలాంటి కారణాల్ని వివరించలేదు.

మార్పులు అనేకం
ఈ సందర్భంగా ‘‘గత దశాబ్దంలో ఒమిడ్యార్ నెట్‌వర్క్ ఇండియా పెట్టుబడులు పెట్టే విషయంలో కీలక పాత్రపోషించింది. అయితే వ్యాపారం పరంగా తమ లక్ష్యాల్ని చేరుకునేందుకు ఇకపై భారత్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయడం లేదు. 2010 నుంచి భారత్‌లో సేవలందిస్తున్నాం. ఆర్ధికంగా, వ్యాపార పరంగా  అప్పటి ఇప్పటికి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి’’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. 

2010లో అడుగు పెట్టి.. 
2010 నుండి భారతదేశంలో పనిచేస్తున్న ఒమిడ్యార్ గ్రూప్ 500 మిలియన్లకు పైగా పెట్టుబడులను అందించింది. ముఖ్యంగా, దాదాపు 150 మిలియన్లను స్వచ్ఛంద సంస్థలకు అందించింది. దాదాపు 70 శాతం ఆయా సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసినట్లు పలు నివేదికలు హైలెట్‌ చేశాయి.

చదవండి👉  'వర్క్‌ ఫ్రమ్‌ హోం'పై ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు