భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రి.. పాక్‌‌ తప్ప

23 Jan, 2021 08:34 IST|Sakshi

చైనా, పాకిస్తాన్‌ మినహా పలుదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరాతో తోడ్పాటు 

న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నుంచి భారత్‌ తనని తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు సాయపడుతోంది. పొరుగు దేశాల సంక్షేమమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతుందని భారత ప్రధాని మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. అందులో భాగంగా జనవరి 20వ తేదీ నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌ పంపించే ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. తాజాగా శుక్రవారం మారిషస్‌ సీషెల్లెస్‌లకు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయరుచేస్తోన్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను విమానాల ద్వారా పంపించి, భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రీ ఒప్పందాన్ని నిలబెట్టుకుంది. వ్యాక్సిన్‌ విదేశీ సరఫరా సందర్భంగా తీసిన ఫొటోలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. భూటాన్, బాంగ్లాదేశ్, మాల్దీవ్స్, నేపాల్, మయన్మార్, సీషెల్లన్స్‌లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ని పంపిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. చైనా మినహా భారత పొరుగు దేశాల వ్యాక్సిన్‌ మైత్రి జాబితాలో చేరని ఏకైక దేశం దాయాది పాకిస్తాన్‌. పాకిస్తాన్‌ మాత్రం భారత్‌ సాయాన్ని ఆశించలేదని భారత ప్రభుత్వాధికారులు తెలిపారు. భారత్‌ నుంచి తొలి రోజు భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశారు. రెండో రోజు బాంగ్లాదేశ్, నేపాల్‌లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ని పంపించారు. శుక్రవారం మయన్మార్, సీషెల్లెన్స్‌లకు వ్యాక్సిన్‌ని సరఫరా చేశారు. పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాల కొనసాగింపులో భాగంగా ఈ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది. దీంతో పాటు బ్రెజిల్, మొరాక్కో దేశాలకు సైతం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య ఎగుమతులను కూడా భారత్‌ ప్రారంభించింది. బ్రిటన్‌కి చెందిన ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధిపరుస్తోన్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ దిగ్గజ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేస్తోంది.
(చదవండి: కరోనా టీకా: యాప్‌లో కనిపించని పేర్లు‌..!)

భూటాన్‌... 
భారత్‌ నుంచి స్నేహపూర్వక వ్యాక్సిన్‌ బహుమతిని అందుకున్న తొలి దేశం భూటాన్‌ కావడం విశేషం. తొలిసారి జనవరి 20న , 150,000 డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ మైత్రీ ఒప్పందంలో భాగంగా మన దేశం భూటాన్‌కి పంపింది. భారత ప్రభుత్వ ఉదారత్వానికి భూటాన్‌ విదేశాంగ మంత్రి తాండి డోర్జీ కృతజ్ఞతలు తెలిపారు. 

మాల్దీవులు..
పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యాన్నిస్తూ మల్దీవులకు సైతం భారత్‌ 100,000 కోవిడ్‌– 19 వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసింది. వ్యాక్సిన్‌ సరఫరా చేసి సాయపడినందుకు గాను మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ సోలి భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కొద్ది సేపటి క్రితమే లక్ష వ్యాక్సిన్‌ డోసులతో భారత్‌ నుంచి మాల్దీవులకు ఓ విమానం చేరుకుంది. త్వరలోనే కోవిడ్‌–19ను అధిగమించాలన్న మా ఆశలను ఇది పునరుద్ధరించింది. ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు’’అని మాల్దీవ్స్‌ అధ్యక్షుడు ట్వీట్‌ చేశారు

నేపాల్‌... 
పొరుగు దేశాలకు తోడ్పాటు నందించే కార్యక్రమంలో భాగంగా భారత్‌ నేపాల్‌కి సైతం గురువారం పది లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసిందని ప్రజారోగ్య మంత్రి హృద్యేష్‌ త్రిపాఠీ తెలిపారు. గురువారం పంపిన ఈ పది లక్షల వ్యాక్సిన్‌ డోసులు తొలిదశ వాయిదాలో భాగంగా పంపినవే. వ్యాక్సిన్‌ డోసులను మాత్రమే కాకుండా కోవిడ్‌ మహమ్మారితో పోరాడేందుకు నేపాల్‌కి గతంలో వైద్య పరికరాలు, ఔషధాలు తదితరాలను సైతం భారత్‌ సరఫరా చేసింది. నేపాల్‌ ప్రభుత్వం 72 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది. అత్యంత క్లిష్లసమయంలో భారత్‌ పదిలక్షల కోవిడ్‌ వ్యా క్సిన్‌ డోసులను నేపాల్‌కి ఇవ్వడం పట్ల నేపాల్‌ ప్రధాని కెపి.ఓలి భారత ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. 
(చదవండి: టీకాల పనితీరుపై.. ‘టెన్షన్‌’ ప్రభావం!)

బంగ్లాదేశ్‌... 
స్నేహపూర్వక హామీలో భాగంగా బాంగ్లాదేశ్‌కి 20 లక్షల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ డోసులను భారత దేశం సరఫరా చేసింది అని బాంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్‌ ఎకె.అబ్దుల్‌ మొహమ్మద్‌ చెప్పారు. ‘‘1971లో జరిగిన విముక్తియుద్ద కాలం నుంచి భారత్‌ బాంగ్లాదేశ్‌ పక్షాన నిలిచింది. ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కోవిడ్‌ సంక్షోభ కాలంలోనూ భారత్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రూపంలో బహుమతిని ఇచ్చింది’’అని ఆయన ట్వీట్‌ చేశారు.  

సెషెల్లెస్‌... 
మైత్రీ ఒప్పందంలో భాగంగా సెషెల్లెస్‌కి భారత్‌ నుంచి 50,000 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సరఫరాచేయాలని భావించారు. అందులో భాగంగానే వ్యాక్సిన్‌ డోసులను ఆ దేశానికి సరఫరా చేశారు. ఈ 50,000 మోతాదుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో దాదాపు సెషెల్లెస్‌ జనాభాలో పావుభాగానికి టీకా వేయొచ్చని భావిస్తున్నారు. నిజానికి డిసెంబర్‌ 2020 నాటికి సెషెల్లెస్‌ కోవిడ్‌ ఫ్రీ కంట్రీగా ఉంది.  

మారిషస్‌... 
శుక్రవారం మధ్యాహ్నం నాటికి మారిషస్‌కి భారత్‌నుంచి ఒక లక్ష డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరింది.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు