గుజరాత్‌ తీరంలో పట్టుబడ్డ పాక్‌ డ్రగ్స్‌ బోటు.. విలువ రూ.200 కోట్లు!

14 Sep, 2022 13:24 IST|Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌: సరిహద్దులో మరోసారి భారీ మోతాదులో డ్రగ్స్‌ పట్టుబడింది. అరేబియా సముద్రం గుండా భారత జలాల్లోకి చొరబడిన.. పాకిస్థాన్‌ పడవను ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్త ఆపరేషన్‌ ద్వారా గుజరాత్‌ తీరంలో పట్టుకున్నాయి. సుమారు 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటి విలువ ఏకంగా రూ.200 కోట్ల విలువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

కచ్‌ జిల్లా జకావ్‌ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవలో హెరాయిన్‌ను తరలిస్తుండగా కోస్టుగార్డు, ఏటీఎస్​ సిబ్బంది గుర్తించారు. ఆ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. సముద్రమార్గం ద్వారా డ్రగ్స్‌ను గుజరాత్‌కు చేర్చి.. రోడ్డుమార్గంలో పంజాబ్‌కు తరలించాలని నేరస్తులు ప్లాన్‌ చేశారని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. గత నెలలోనూను కచ్‌ జిల్లాలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థానీ చేపల బోటును బీఎస్‌ఎఫ్‌ సైనికులు పట్టుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్‌ మంద్రాపోర్టులో పెద్దమొత్తంలో హెరాయిన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అనుకుని..

మరిన్ని వార్తలు