Reusable Launch Vehicle: పుష్పక్‌.. తగ్గేదేలే!

23 Mar, 2024 05:11 IST|Sakshi
పుష్పక్‌ను 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడుస్తున్న హెలికాప్టర్‌; రన్‌వేపై దిగుతున్న పుష్పక్‌

ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌–02 ప్రయోగం విజయవంతం  

సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్‌ రాకెట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్‌ వెహికల్స్‌ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం.

రీయూజబుల్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్‌’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌–01 మిషన్‌ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్‌ ల్యాండింగ్‌ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌(ఏటీఆర్‌) నుంచి ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌–02 మిషన్‌ పరీక్ష నిర్వహించారు.

నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్‌ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్‌ హెలీకాప్టర్‌ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్‌ ప్రకారం రన్‌వే మీద పుష్పక్‌ సురక్షితంగా దిగింది. బ్రేక్‌ పారాచ్యూట్, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్, నోస్‌వీల్‌ సిస్టమ్‌ సాయంతో పుష్పక్‌ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్‌ ల్యాండింగ్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్ అభినందించారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers