ఎన్నికల ముందు ఎంత మందిని జైల్లో వేస్తారు? సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు ఎంత మందిని జైల్లో వేస్తారు? సుప్రీంకోర్టు

Published Mon, Apr 8 2024 2:38 PM

How Many Will Be Jailed Before Polls: Supreme Court Big Judgement - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.  సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేసిన అందరినీ జైల్లోకి నెట్టలేమని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూట్యూబర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జస్టిస్‌లు అభయ్‌ ఎస్‌ ఓకా, ఉజ్జల్‌ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించారు.

సీఎం స్టాలిన్‌పై 2021లో యూట్యూబర్‌ దురైముగురుగన్‌ సత్తాయి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో అత‌న్ని అప్ప‌ట్లో అరెస్టు చేశారు. 2021 న‌వంబ‌ర్‌లో మ‌ద్రాసు హైకోర్టు అత‌నికి బెయిల్ ఇచ్చింది. ఆ త‌ర్వాత హైకోర్టులోని డివిజ‌న్ బెంచ్ ఆ బెయిల్‌ను ర‌ద్దు చేసింది. తన బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలను మురుగన్‌ సుప్రీంలో సవాల్‌ చేశారు.  2022లో అత్యున్నత న్యాయస్థానం ఆ యూట్యూబ‌ర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అత‌ను ఆ బెయిల్‌పైనే ఉన్నాడు. 

గ‌డిచిన 2.5 ఏళ్లుగా మురుగ‌న్ బెయిల్‌పైనే ఉన్నార‌ని, అత‌ని బెయిల్‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను తాము కొట్టిపారేస్తున్నామ‌ని నేడు సుప్రీం బెంచ్ తెలిపింది. కాగా మురుగన్‌ తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడని నిరూపించడనికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. బెయిల్‌పై ఉన్న యూట్యూబర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆయనపై షరతు విధించాలన్న అభ్యర్ధనను సైతం కోర్టు తోసిపుచ్చింది. 

తమిళనాడు ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది ముకుల్‌ రోహత్గిని ఉద్దేశిస్తూ. ‘ఎన్నికల ముందు యూట్యూబ్‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి.. ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి’ అంటూ జస్టిప్‌ ఓకా ప్రశ్నించారు.

Advertisement
Advertisement