కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం సంతాపం

19 Apr, 2021 08:56 IST|Sakshi

సాక్షి, పట్నా : దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా వైరస్‌  ప్రభావం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా భారీగా విస్తరిస్తోంది.  బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, జనతాదళ్  (యునైటెడ్) ఎమ్మెల్యే  మేవాలాల్‌ చౌదరి కన్నుమూశారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన పట్నాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుది శ్వాస విడిచారు. దీనిపై  బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సంతాపం  ప్రకటించారు. ఆయన మరణం విచారకరమని, విద్య, రాజకీయ రంగాలకు కోలుకోలేని నష్టమని సీఎం  తెలిపారు.

బిహార్ తారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చౌదరి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విద్యా మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో  ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మే 15 వరకు మూసివేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ ఒక నెల బోనస్ జీతాన్ని అందించనుంది. మరోవైపు 8,690  కొత్త కేసులతో ఆదివారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ‍్య 3,24,117 కు చేరింది. 27 తాజా మరణాలతో కరోనా మరణాల సంఖ్య 1,749కు పెరిగింది.

మరిన్ని వార్తలు