బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్‌ ఎమ్మెల్యే

13 Mar, 2024 07:44 IST|Sakshi

రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్‌లోని బర్కాగాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్‌ ఇచ్చిందని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసినందుకే తన నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు.

‘నాకు బీజేపీ  హజారీబాగ్‌ ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేసింది.  కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు.

మనీలాండరింగ్‌ కేసులో అంబ ప్రసాద్‌కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్‌ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్‌ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం.  

ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్‌, రివాల్వర్‌ రాణి 

Election 2024

మరిన్ని వార్తలు