అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే! | Sakshi
Sakshi News home page

Atlanta: అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!

Published Wed, Mar 13 2024 7:29 AM

Gas Station Cashier Associate Held for Staging Elaborate Robbery - Sakshi

అ‍ట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్‌లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్‌ స్టేషన్‌ నిర్వాహకుడు, క్యాషియర్‌ రాజ్‌ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్‌ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్‌ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. 

రాజ్‌ పటేల్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కర్టిస్‌లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్‌ పటేల్‌ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్‌ పటేల్‌ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు.

సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్‌ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి  బయటపడేందుకు గ్యాస్‌ స్గేషన్‌లోని  మరో తలుపును ఉపయోగించాడని రాజ్‌ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే  కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. 

వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. 

కర్టిస్ గ్యాస్ స్టేషన్‌లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్  తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్‌ పటేల్‌ చేసిన ప్లాన్‌ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్‌ పటేల్‌ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్‌ చేశాడని కర్టిస్‌ పోలీసులకు తెలిపాడు. 
 

Advertisement
Advertisement