Covid-19: భారత్‌లో తొలి పేషెంట్‌కు మరోసారి పాజిటివ్‌..

13 Jul, 2021 17:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేరళ వైద్య విద్యార్థినికి రెండోసారి పాజిటివ్

తిరువనంతపురం: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌ మరో సారి వైరస్‌ బారిన పడ్డారు. ఇండియాలో కేరళకు చెందిన వైద్య విద్యార్థిని తొలిసారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. త్రిసూర్‌కు చెందిన 20 ఏళ్ల సదరు మెడికల్‌ స్టూడెంట్‌ చైనా, వుహాన్‌లోని ఓ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకునేవారు. 

ఈ క్రమంలో జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా కేసు. వైరస్‌ జన్మస్థలంగా భావిస్తున్న వుహాన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. భారత్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.  

సదరు విద్యార్థిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు త్రిసూర్‌లోని ఆసుప్రతిలో క్వారంటైన్‌లో ఉన్నారు. మూడు వారాల తర్వాత కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఆ విద్యార్థిని మరోసారి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. యాంటీ జెన్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని త్రిసూర్‌ జిల్లా మెడికల్‌ అధికారి డాక్టర్‌ కేజీ రీనా తెలిపారు. 

అయితే ఆమెకు ఎలాంటి పాజిటివ్‌ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలటంతో మళ్ళీ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ వైద్య విద్యార్ధిని ఇప్పటి వరకు ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది.  ప్రసుత్తం ఆ విద్యార్ధిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు