కొత్త పార్లమెంట్‌ భవనంపై లాలు యాదవ్‌ పార్టీ వివాదాస్పద ట్వీట్‌

28 May, 2023 11:27 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్‌ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వేళ.. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్‌ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్‌ చేసింది.

వాస్తవానికి పార్లమెంట్‌ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్‌ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్‌ మోదీ ఇలా పార్లమెంట్‌ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ‍ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్‌ గౌతమ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు.

కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సైతం కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్‌ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది.

(చదవండి: కొత్త పార్లమెంట్‌ భవనం కోసం షారూఖ్‌, అక్షయ్‌ కూమార్‌ల వాయిస్‌ ఓవర్‌)

మరిన్ని వార్తలు