Lok sabha elections 2024: సార్వత్రిక సమరం

17 Mar, 2024 04:03 IST|Sakshi
శనివారం ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్‌కుమార్‌. చిత్రంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు. ఓటుహక్కు ఉన్నవారంతా విధిగా ఓటేయాలని ఈ సందర్భంగా వారు ఇలా విజ్ఞప్తి చేశారు.

2024 ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 దాకా ఏడు విడతల్లో పోలింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్‌ జరగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్‌ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్‌ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్‌ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది.

తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్‌ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్‌ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున
ఖర్గే అన్నారు.

ప్రపంచానికే తలమానికంగా...
ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్‌ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్‌ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్‌ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్‌లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్‌లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే...
► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్‌లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం.
► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం.
► నాన్‌ షెడ్యూల్డ్‌ చార్టర్డ్‌ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి.
► అక్రమ ఆన్‌లైన్‌ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది.
► అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వీవీప్యాట్‌ యంత్రాలు వినియోగిస్తారు.
► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు.

ఆ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్‌!
ఈసీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్‌సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్‌లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్‌ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్‌ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్‌ జరగనుంది.  

‘4ఎం’ సవాలుకు సిద్ధం
‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్‌ (కండ బలం), మనీ (ధన బలం), మిస్‌ ఇన్ఫర్మేషన్‌ (తప్పుడు సమాచారం), మోడల్‌ కోడ్‌ వయోలేషన్స్‌ (కోడ్‌ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం.

జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్‌ ఆధారిత తనిఖీలు, నాన్‌ చార్టర్డ్‌ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్‌ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం.

ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్‌ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్‌ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.  

26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 19 న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్‌ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్‌ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది.

హోరాహోరీ తలపడండి, కానీ...
ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్‌ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు.

‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్‌ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు.

విరాళాలపై నిఘా
పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers