కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్‌ 

5 Aug, 2020 19:34 IST|Sakshi

భోపాల్‌ : కరోనావైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు.  జూలై 25న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎం చౌహాన్‌ చికిత్స కోసం చిరాయు ఆస్పత్రిలో చేరారు. పదకొండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఈరోజు డిశ్చార్జి అయ్యారు. ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం చౌహాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
(చదవండి : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌)

మరోవైపు సీఎం చౌహన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌ లోకేంద్ర పరాషర్ వెల్లడించారు. సీఎం చౌహాన్‌  డిశ్చార్జ్‌ను  స్వాగతిస్తున్నట్లు  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ ట్వీట్‌ చేశారు. వైద్యులు సలహా మేరకు ఐసోలేషన్ నిబంధనలు పాటించాలని చౌహాన్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు