కొత్త వైరస్‌తో మరణాలు ఎక్కువే!

30 Dec, 2020 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్వల్ల మరణాలు పెరగడమే కాకుండా, టీనేజ్‌ పిల్లలు, యువతపై కూడా ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఇండియా’ అధ్యక్షులు కే. శ్రీనాథ్‌ రెడ్డి హెచ్చరించారు. ఏడాది క్రితం వెలుగులోకి వచ్చిన కోవిడ్‌గా పిలిస్తున్న కరోనా వల్ల ఎంత శాతం మంది మృత్యువాత పడ్డారో, రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వల్ల కూడా అంతే శాతం మంది మత్యువాత పడుతున్నప్పటికీ, ఈ రకం వైరస్‌ 60 నుంచి 70 శాతం ఎక్కువ వేగంతో విస్తరిస్తున్నందున ఆ మేరకు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

శ్రీనాథ్‌ రెడ్డి ‘ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ అధిపతిగానే కాకుండా హార్వర్డ్‌ యూనివర్శిటీ ఎపిడిమాలోజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. మొదటి రకం కరోనా ఆరోగ్యంగా ఉన్న యువతపై ఎలాంటి ప్రభావం చూపించక పోగా, ఈ కొత్త రకం కరోనా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని మానవ శరీర కణాల్లోకి వేగంగా చొచ్చుకుపోయి పెద్ద సంఖ్యలో పునరుత్పత్తిని పెంచుకునేందుకు వీలుగా ఈ కరోనా రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు.

రూపాంతరం చెందిన వైరస్‌లో కూడా 17 రకాలు ఉన్నాయని, ఇవి తూర్పు ఇంగ్లండ్, దక్షిణ ఇంగ్లండ్‌ ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చి, అక్కడి నుంచి వచ్చిన భారతీయుల ద్వారా భారత్‌కు కూడా వచ్చాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి. ఈ వైరస్‌ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా రాకుండా ప్రస్తుతం తీసుకుంటున్న అన్ని జాగ్రత్తలు ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటే సరిపోతుందని శ్రీనాథ్‌ రెడ్డి సూచించారు.
 

మరిన్ని వార్తలు