NEW YEAR 2024: న్యూ ఇయర్‌ దశకం

31 Dec, 2023 05:30 IST|Sakshi

మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే...

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ
ఈ దశాబ్దంలోనే భారత్‌ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు.

2.దూసుకుపోనున్న  యూపీ
ఉత్తరప్రదేశ్‌ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్‌డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది.


3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట
2024 అక్టోబర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది.

4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్‌
అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్‌ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్‌ 1994 డిసెంబర్‌ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్‌ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు.

5. మెగా మార్కెట్‌ క్యాప్‌
భారత మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్‌ క్యాప్‌ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్‌ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

6. 20 కోట్ల మంది పేదలు
ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్‌ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది.  

7. వ్యవసాయోత్పత్తుల రికార్డు
భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు.


8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు
కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్‌ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్‌ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది.

9. విదేశీ వాణిజ్యం పైపైకి...
భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది.

10. బీజేపీ వర్సెస్‌ ‘ఇండియా’ 
విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్‌ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్‌ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

>
మరిన్ని వార్తలు