Nirbhaya: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?

16 Dec, 2023 09:46 IST|Sakshi

అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ  ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అ‍త్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. 

నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు.

ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్‌ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్‌లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. 

ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి.  ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్‌సీఆర్‌బీ..  నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు.          

సంవత్సరం  అత్యాచారం కేసులు
2022 31,516
2021 31,677
2020 28,046
2019 32,032
2018 33,356
2017 32,559
2016 38,947
2015 34,651
2014 36,735
2013 33,707
2012 24,923

నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా  దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..

>
మరిన్ని వార్తలు