Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి

15 Dec, 2023 04:41 IST|Sakshi

సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్‌ వేల్స్‌ లోని క్రిమినల్‌ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్‌ ఫాల్బిగ్‌కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు.

తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్‌ ఫిమేల్‌ సీరియల్‌ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది.

దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్‌ వేల్స్‌ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్‌ ఫాల్బిగ్‌ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను.

పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్‌ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు.

>
మరిన్ని వార్తలు