మహిళ వైరల్‌ వీడియో.. ‘పెగ్గు పడితే కరోనా పరారే’

30 Apr, 2021 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, మందుబాబులు మాత్రం కరోనా గిరోనా జాన్తా నై.. అంటున్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూలతో వైన్‌ షాప్‌లు మూసేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. పెగ్గు పడితే కరోనా పారిపోవాల్సిందే అంటూ మందు షాపులు తెరవాలని కోరుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన డాలీ అనే మహిళ వైన్‌ షాపులు తెరవాలని ఏకంగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కే మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
 
ఇటీవల ఆరు రోజుల లాక్‌డౌన్‌ విధించిన ఢిల్లీ సర్కార్‌ కేసుల్లో తగ్గుదల లేకపోవడంతో ఏప్రిల్‌ 26 నుంచి మే 3 వరకు లాక్‌ డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర, అత్యవసర దుకాణాలు మినహా మిగతా అన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబులు అల్లాడిపోయారు. అధిక ధర చెల్లించి బ్లాక్‌లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు.

కానీ ఎక్కడా మందు దొరకలేదు. ఆ సమయంలో ఢిల్లీ శివపురి కాలనీకి చెందిన ఓ వైన్‌ షాప్‌ వద్దకు మద్యం కొనుగోలు చేసేందుకు డాలీ అనే మహిళ అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ టీకా కూడా ఆల్కహాల్‌తో సరితూగలేదు. ఎందుకంటే ఆల్కహాల్ మాత్రమే నిజమైన మెడిసిన్‌. 35 ఏళ్లుగా మద్యం తాగడం వల్ల తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అన్నారు. 

'ఒక్క పెగ్గు పడితే కరోనా పారిపోతుంది. లాక్‌ డౌన్‌ ఎత్తేసి, మద్యం దుకాణాలకు అనుమతులివ్వాలి. అలా చేస్తే కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులన్నీ ఖాళీ అవుతాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్‌ సమస్య నుంచి భయటపడుతుంది' అంటూ జోస్యం చెప్పారు.  సదరు మహిళ మాట్లాడే సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి.. మీకు లాక్‌ డౌన్‌ లో కూడా మందు ఎలా లభించింది? అని ప్రశ్నించగా.. ‘నేను స్టోర్‌ చేసుకున్న మందు అయిపోయింది. అందుకే మద్యం దుకాణాల్ని ఓపెన్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని జవాబిచ్చారు. 

మరిన్ని వార్తలు