రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం

4 Jun, 2022 06:07 IST|Sakshi

బీజేపీ నుంచి 14, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నుంచి చెరో నలుగురు

‘స్వతంత్రుని’గా పెద్దల సభకు సిబల్‌

16 స్థానాలకు 10వ తేదీన ఎన్నికలు

న్యూఢిల్లీ: పెద్దల సభకు కొత్తగా 41 మంది పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పి.చిదంబరం, రాజీవ్‌ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్రా వాల్మీకి, కవితా పటిదార్, కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్, ఆర్జేడీ నుంచి మీసా భారతి, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్‌ చౌదరి తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.  ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 11 మంది, తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్‌ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్‌ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్‌ నుంచి ఇద్దరు, పంజాబ్‌ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్‌ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికయ్యారు. జేఎంఎం, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. తాజా ఎన్నికతో ఎగువ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం ఏకంగా తొమ్మిదికి చేరింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాల భర్తీ చేయడానికి ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. ఏకగ్రీవం కాగా మిగిలిన 16 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హరియాణాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయాలు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమయ్యింది. తమ పార్టీకి చెందిన దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లో క్యాంప్‌నకు తరలించింది. తమ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష బీజేపీ గాలం వేస్తుందన్న అనుమానంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తోంది. 

మరిన్ని వార్తలు