Telangana: మా ఓటు కేసీఆర్‌కే.. | Sakshi
Sakshi News home page

Telangana: మా ఓటు కేసీఆర్‌కే..

Published Sun, Aug 27 2023 1:10 AM

People of Kamareddy villages are supported to Kcr - Sakshi

మాచారెడ్డి/కామారెడ్డి: సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావ్‌ ఆధ్వర్యంలో ఎల్లంపేటతో పాటు మరో ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

అలాగే పాల్వంచ మండలం మంతన్‌ దేవునిపల్లి గ్రామస్తులు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు తప్ప ఎవరికీ ఓటేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఎంపీపీ నర్సింగరావు, జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు. ఎల్లంపేటలో ర్యాలీ అనంతరం తమ తీర్మాన ప్రతులతో కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను కలసి తీర్మాన కాపీలను అందజేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎన్నికల ఖర్చుకోసం 10 గ్రామాల ప్రజలు రూ.50 వేలు జమచేసి కవితకు అందజేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ కోసం అప్పట్లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తొలినాళ్లలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని చరిత్ర సృష్టించారు. అప్పట్లో 13 ఎంపీటీసీలకు గాను 8 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే జెడ్పీటీసీని కూడా గెలిపించారు. 

కేసీఆర్‌కే జై కొడుతున్న పంచాయతీలు: కవిత
సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిజామాబాద్‌ బిడ్డగా స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తారని ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు, గిరిజన తండాలు కేసీఆర్‌కు జై కొడుతున్నాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలసి ఏకగ్రీవ తీర్మాన ప్రతులను అందజేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీచేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కేసీఆర్‌ను పోటీ చేయాలని అహా్వనించారని చెప్పా రు. మాచారెడ్డి మండలంలోని గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారని, షబ్బీర్‌ అలీ వంటి వారు ఎన్నిమాట్లాడినా, ప్రజలు కేసీఆర్‌ను పార్టీలు, కులమతాలకు అతీతంగానే చూస్తారని ఆమె పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అయచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్‌ సాగర్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, గాంధారి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యంరావు పాల్గొన్నారు. కాగా, ఎంపీపీ నర్సింగరావుకు శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి అభినందించారు. 

Advertisement
Advertisement