పైలట్‌కు ‘ఛత్తీస్‌’ బాధ్యతలు

24 Dec, 2023 05:57 IST|Sakshi

ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతల్లో మార్పు చేసిన ఏఐసీసీ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ రాజస్తాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు పారీ్టలో కీలక పదవి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌చార్జ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీ సభ్యులుగా, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగిన రెండు రోజులకే ఇలా పలువురు ప్రధాన కార్యదర్శలు, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలను మార్చడం గమనార్హం.

ఢిల్లీ, హరియాణా ఇన్‌చార్జ్‌ బాధ్యతలను దీపక్‌ బబారియాకు అప్పగించారు. కూమారి సెల్జాను ఉత్తరాఖండ్‌ ఇన్‌చార్జ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను అండమాన్‌ అండ్‌ నికోబార్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించారు. జార్ఖండ్‌ ప్రధాన కార్యదర్శి జీఏ మిర్‌కు పశ్చిమబెంగాల్‌ బాధ్యతలూ అప్పగించారు. జితేంద్ర సింగ్‌కు మధ్యప్రదేశ్‌ బాధ్యతలు కట్టబెట్టారు.

మహారాష్ట్ర ఇన్‌చార్జ్‌గా రమేశ్‌ చెన్నితల, బిహార్‌ ఇన్‌చార్జ్‌గా మోహన్‌ ప్రకాశ్‌ నియమితులయ్యారు. మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు ఇన్‌చార్జ్‌గా చెల్లకుమార్‌ ఎంపికయ్యారు. అజయ్‌ కుమార్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌ ఇన్‌చార్జ్‌గా భరత్‌సిన్హ్‌ సోలంకీ, హిమాచల్, చండీగఢ్‌ ఇన్‌చార్జ్‌గా రాజీవ్‌ శుక్లా, రాజస్తాన్‌ ఇన్‌చార్జ్‌గా సుఖ్‌జీందర్‌ సింగ్‌ రణ్‌ధావా, పంజాబ్‌ ఇన్‌చార్జ్‌గా దేవేందర్‌ యాదవ్, గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్, హవేలా ఇన్‌చార్జ్‌గా మాణిక్‌రావు థాకరేను నియమించారు. త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్‌లకు గిరీశ్‌ చోదంకర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ, ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు.

ప్రియాంక చేజారిన యూపీ
ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«దీని తప్పించడం గమనార్హం. ప్రియాంక గాం«దీకి ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నాసరే ఆమెకు ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు. అవినాశ్‌ పాండేకు ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను కట్టబెట్టారు. అజయ్‌ మాకెన్‌ పార్టీ కోశాధికారిగా ఉంటారు.

>
మరిన్ని వార్తలు