కరోనాపై జాతీయ విధానం కావాలి

2 May, 2021 02:50 IST|Sakshi

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కోవాలి

పేదల ఖాతాలకు నెలకు రూ.6 వేల చొప్పున బదిలీ చేయాలి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి జాతీయ విధానం తీసుకురావాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక వీడియో సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని, బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. దేశ పౌరులందరికీ కరోనా టీకాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చెప్పారు. ఇది మనకు పరీక్షా సమయమని, దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని, ఒకరికొకరు సహకరించుకోవాల ని పిలుపునిచ్చారు.  

టీకా ధరల్లో వివక్షను అంతం చేయండి  
పేద ప్రజలు, వలస కూలీలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని, ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగి వెళ్లున్నారని, వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నెలకు రూ.6,000 చొప్పున బదిలీ చేయాలని సోనియా గాంధీ సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలన్నారు. బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులకు ఆక్సిజన్, ఔషధాలు, ఇతర పరికరాలు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని కోరారు. కరోనా టీకా ధరల్లో వివక్షను అంతం చేయాలని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటం విషయంలో తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని సోనియా గాంధీ ఉద్ఘాటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మన దేశం త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు