ఈటల.. నెక్ట్స్‌ ఏంటి!

2 May, 2021 02:49 IST|Sakshi

మంత్రి ఈటల ఎపిసోడ్‌పై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ 

శుక్రవారం సాయంత్రం నుంచి హాట్‌ టాపిక్‌ ఇదే 

ఈటల, సీఎం స్పందనలపై ప్రధాన రాజకీయపక్షాల నిశిత పరిశీలన 

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలవరం... బీసీ సంఘాల్లోనూ ఆందోళన 

ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ తదుపరి పరిణామాలపై అంచనా 

ఇప్పుడు ఈటల స్టెప్‌ ఏంటన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉత్కంఠను రేపుతోంది. శుక్రవారం మంత్రి భూవివాదం తెరపైకి రావడం.. ఆ వెంటనే విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించడం.. మరునాడు ఈటల నుంచి వైద్య, ఆరోగ్య శాఖను తొలగించడం.. శాఖ లేని మంత్రిగా మిగిల్చి షాక్‌ ఇవ్వడం.. వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో అసలేం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈటల ఎపిసోడ్‌ అంతిమంగా ఏ మలుపు తీసుకుంటోంది? ఉన్నట్టుండి రాజేందర్‌పై ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? వచ్చినా సీఎం కేసీఆర్‌ ఇంత అనూహ్యంగా స్పందించి విచారణకు ఆదేశించడం ఏంటి? ఈ ఆదేశాలతో కంగుతిన్న ఈటల విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?

తెలవారగానే మెదక్‌ జిల్లా యంత్రాంగం, విజిలెన్స్‌ డీజీలు అచ్చంపేట, హకీంపేట భూముల్లో వాలిపోవడం ఏంటి? గంటల వ్యవధిలో నివేదిక తయారు చేయడం ఏంటి? ఈ నివేదిక అందీ అందక ముందే... ఇంకా అధికారులు పూర్తిగా సైట్‌ ఖాళీ చేసి వెళ్లిపోకముందే రాజేందర్‌ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖలను సీఎంకు ఎందుకు బదలాయించారు? మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న ముఖ్య అనుచరుడు, బీసీ నేత ఈటల విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌లతో ఈటలకు ఎక్కడ చెడింది? ఇప్పుడు రాజేందర్‌ ఏం చేయబోతున్నారు? సీఎం కేసీఆర్‌ మున్ముందు ఏం చర్య తీసుకోనున్నారు? మరో ముగ్గురు, నలుగురు మంత్రులది కూడా ఇదే పరిస్థితి అనే ప్రచారంలో వాస్తవం ఉందా.. లేదా? అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం మార్పులు జరగబోతున్నాయి?... శనివారమంతా రాష్ట్ర రాజకీయవర్గాలను వేధించిన ప్రశ్నలివి. సామాన్య ప్రజానీకం కూడా ఈటల ఎపిసోడ్‌పైనే దృష్టి పెట్టింది. అటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర రాజకీయపక్షాల నేతలు, బీసీ, కుల సంఘాల నేతలు కూడా ఈటల వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చారు. ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయి ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందన్న దానిపై ఆరా తీస్తూ కనిపించారు.  చదవండి: (కబ్జా ఆరోపణలు.. ఈటలకు ఎసరు!)

తెల్లారేసరికి వివాదాస్పద భూముల్లోకి అధికారులు 
అసైన్డ్‌ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు మంత్రి ఈటలపై రాగానే సీఎం కేసీఆర్‌ ఎంత త్వరగా విచారణకు ఆదేశించారో అంతే వేగంగా మెదక్‌ జిల్లా యంత్రాంగం కూడా రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. తెల్లారేసరికి సంబంధిత భూముల డిజిటల్‌ సర్వేకు అధికారులు పూనుకున్నారు. ఏకంగా విజిలెన్స్‌ డీజీ పూర్ణచందర్‌రావు రంగంలోకి దిగి నివేదికలు తయారు చేసే పనిలో పడ్డారు. మరోవైపు చాలా జిల్లాల్లో ఈటలకు మద్దతుగా పలు బీసీ సంఘాలు నిలిచాయి. ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.  

ఈటల రాజకీయ భవితవ్యంపై ఆసక్తి? 
తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల తన రాజకీయ భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ శాఖ లేని మంత్రిగా అవమానకరంగా ఉండే దానికన్నా మంత్రి హోదా నుంచి తప్పుకోవడం మంచిదని కొందరు, అలా తప్పుకుంటే తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నట్టు అవుతుందని మరికొందరు ఆయనకు సూచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తనంతట తాను తప్పుకోవడం కన్నా సీఎం కేసీఆరే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేస్తే ఈటలకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందనే చర్చ ఆయన సన్నిహితుల్లో ఉంది. మరోవైపు, ఈటల మంత్రి పదవిపై ఇంకా ఏమీ తేలకముందే ఆయన టీఆర్‌ఎస్‌లో ఉంటారా... ఉండరా అన్న దానిపై కూడా అంచనాలు మొదలయ్యాయి. ఒకవేళ ఆయన పార్టీని వీడితే తమ శిబిరంలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు కూడా ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. ఈటలపై చర్యలు పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్‌లో కొంత అలజడి వస్తుందని, ఆ అలజడిలో కొందరు పార్టీని వీడతారనే అంచనా కూడా ప్రధాన రాజకీయ పక్షాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లో ఉంటారా? పార్టీలో ఉన్నా మంత్రిగా ఉంటారా? రెండూ వీడాల్సిన పరిస్థితుల్లో ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీలో చేరతారా? లేదా స్వతంత్రంగా ఉండి కేసీఆర్‌ అండ్‌ కోపై విమర్శల జడివాన కురిపించడం ద్వారా తనకు కలిగిన అవమానంపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? లేక సైలెంట్‌గా ఉండి ఎప్పుడు బయటకు రావాలో అప్పుడు వస్తారా... అన్నది తెలంగాణ రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

‘ఆరోగ్యం’.. అనారోగ్యమా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన నేతల భవితవ్యంపై అప్పట్లో ఆందోళన ఉండేది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఇది కొనసాగింది. అయితే, దేవాదాయమంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టడంతో ఆ శాఖ వాస్తు మారిపోయింది. కానీ, ఈటల తాజా ఎపిసోడ్‌తో ఆరోగ్య శాఖ మంత్రులది కూడా అదే పరిస్థితి అనే చర్చ జరుగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టి.రాజయ్య తెలంగాణ ఉప ముఖ్యమంత్రి హోదాతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలను తొలుత చేపట్టారు. ఆ పదవి ఆయనకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. ఏకంగా ఆయన్ను కేబినెట్‌ నుంచే సీఎం కేసీఆర్‌ బర్తరఫ్‌ చేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సి.లక్ష్మారెడ్డి ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి గెలిచినా, ఆయనకు అమాత్య యోగం లభించలేదు. ఇప్పుడు ఆరోగ్యమంత్రిగా ఉన్న ఈటల కూడా అవమానకరరీతిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కలసి రాని శాఖల జాబితాలో వైద్య, ఆరోగ్య శాఖ వచ్చి చేరింది.    చదవండి: (డిజైన్డ్‌ బై, డిక్టేటెడ్‌ బై సీఎం.. అన్నీ ఆయనే..!) 

మరిన్ని వార్తలు