Maharashtra Politics: ఉద్ధవ్ థాక్రే వర్గానికి మరోసారి చుక్కెదురు! ‘మహా’ స్పీకర్‌కు సుప్రీం కోర్టు కీలక సూచన

11 Jul, 2022 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎం ఏక్‍నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను అ‍త్యవసరంగా విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది.  

అంతేకాదు ఈ పిటిషన్‍పై విచారణ జరిగేవరకు షిండే వర్గంలోని 16 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది.

పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎటూ తేలకముందే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ షిండేను ఆహ్వానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని థాక్రే వర్గం గతవారం సుప్రీంను ఆశ్రయించింది. ఈ 16 మంది బలపరీక్షతో పాటు స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ పాల్గొన్నారని పేర్కొంది. వారి అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలని కోరింది. 

అయితే ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ జరుగుతుందని థాక్రే వర్గం భావించింది. కానీ లిస్టింగ్‌లో ఇది కన్పించలేదు. దీంతో పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని థాక్రే వర్గం కోరింది. అయితే దీన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం పడుతుందని కోర్టు తెలిపింది.  ఆ తర్వాతే విచారణ చేపడతామని చెప్పింది. మంగళవారం కూడా థాక్రే పిటిషన్‌పై విచారణ జరిగే సూచనలు కన్పించడం లేదు.
చదవండి: O. Panneerselvam: పన్నీర్‌ సెల్వానికి భారీ షాక్‌.. పళనికి పార్టీ పగ్గాలు

మరిన్ని వార్తలు