భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు 

10 Nov, 2023 09:56 IST|Sakshi

ఒకచోట భార్యాభర్తలు. మరోచోట బావా మరదళ్లు. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్‌–అబ్బాయ్‌–అమ్మాయ్‌. మరో దగ్గరేమో తండ్రీకూతుళ్లు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలకు వేదికవుతోంది. పలు స్థానాల్లో బంధువుల మధ్య జరుగుతున్న ఈ పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి...! 

రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల పరస్పర పోట్లాటలు రాజస్తాన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి స్థానాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. 

దాంతారాంగఢ్‌: భార్యాభర్తల పోరు 
ఈ స్థానం రాష్ట్రవ్యాప్త ఆసక్తికి కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున వీరేంద్ర సింగ్‌ బరిలో ఉన్నారు. ఆయనపై ఏకంగా భార్య రీటా పోటీ చేస్తున్నారు. జన్‌ నాయక్‌ జనతా పార్టీ తరఫున ఆమె బరిలో ఉన్నారు. వీరేంద్ర తండ్రి నారాయణ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అగ్రనేత కావడం విశేషం. 2018లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమారుడికి టికెట్‌ ఇప్పించి గెలిపించుకున్నారు. అయితే వీరేంద్రకు కొంతకాలంగా భార్యతో గొడవలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిగా వారు విడిగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించగానే రీటా ఏకంగా భర్తపైనే బరిలో దిగారు! 

ధోల్‌పూర్‌: గోదాలో బావామరదళ్లు 
ఇక్కడ బీజేపీ తరఫున శివచరణ్‌ కుష్‌వహా పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ఏకంగా ఆయన మరదలు శోభారాణీకి టికెటిచ్చి బరిలో దించింది. 
చదవండి: ఎన్నికల బరిలో వారసులు

ఆళ్వార్‌ (గ్రామీణ): తండ్రీ కూతుళ్ల సవాల్‌ 
ఇక్కడ బీజేపీ జయరామ్‌ జాటవ్‌కు టికెటిచ్చిం​ది. ఆయనతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మీనాకుమారి ఏకంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తండ్రినే సవాలు చేస్తున్నారు! ఇద్దరు పరస్పరం జోరుగా విమర్శల వర్షం కురిపించుకుంటూ ఓటర్లకు యథాశక్తి వినోదం పంచుతున్నారు. 

బాబాయ్‌–అబ్బాయ్‌–అమ్మాయ్‌ 
భాద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి సంజీవ్‌ బెనీవాల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయన అన్న కుమారుడు అజిత్‌ బెనీవాల్‌ బరిలో దిగి బాబాయ్‌ని సవాలు చేస్తున్నారు. ఖెత్డీ అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మనీషా గుజ్జర్‌ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్‌ ధర్మపాల్‌ బరిలో దిగారు. నాగౌర్‌లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ తరఫున ఆమెకు బాబాయ్‌ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. సోజత్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఆర్య బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన బంధువు శోభా చౌహాన్‌ పోటీలో దిగారు. 

ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌ 
బస్సీ అసెంబ్లీ స్థానంలో మరో రకం పోటీ నెలకొంది. మాజీ ఐఏఎస్‌ చంద్రమోహన్‌ మీనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయనపై పోటీ చేస్తున్న లక్ష్మణ్‌ మీనా మాజీ ఐపీఎస్‌ అధికారి కావడం విశేషం. పైగా వీరిద్దరూ బంధువులే. 

నా కుమారుడికి ఓటు వేయొద్దు! 
ఖండార్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ బైర్వా బరిలో ఉన్నారు. తండ్రి డాల్‌చంద్‌తో ఆయనకు చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నా కొడుక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి’ అంటూ డాల్‌చంద్‌ జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. దాంతో ఏమీ చేయలేక అశోక్‌ తలపట్టుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు