మూడోదశకు.. రూ.వంద కోట్లు

30 Jun, 2021 08:28 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మరింతగా సన్నద్ధం 

ముందు జాగ్జ్రత్త చర్యలకు నిధుల వినియోగం: సీఎం స్టాలిన్‌ వెల్లడి 

సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.100 కోట్లు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ద్రవ ఆక్సిజన్‌ కొనుగోలుకు, కరోనా థర్డ్‌వేవ్‌కు సంబంధించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించాలని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రజలు ఇప్పటి వరకు అందించిన సహకారంతోపాటూ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.353 కోట్లు ఖర్చుచేసినట్లు ఆయన వెల్లడించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దాతలు అందజేసిన విరాళాలను కరోనా నివారణకే ఖర్చుచేస్తామని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ద్రవ ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌ కొనుగోలుకు, రైళ్లద్వారా దిగుమతి చేసుకునేందుకు కంటైనర్ల కొనుగోలుకు మొదటగా రూ.50 కోట్లు వినియోగించామన్నారు. అలాగే కరోనా సెకెండ్‌ వేవ్‌ కట్టడికై రోజుకు 1.60 లక్షల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు కిట్లు సరఫరా తదితర అవసరాల కోసం మరో రూ.50 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా సిప్‌కాట్‌ పారిశ్రామికవాడ ద్వారా సింగపూర్‌ తదితర దేశాల నుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ కొనుగోలుకు రూ.25 కోట్లు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా థర్డ్‌ వేవ్‌ కోసం మరో రూ.100 కోట్లు విడుదల చేసిన ట్లు చెప్పారు. 

త్వరలో డెల్టాప్లస్‌ పరిశోధనా కేంద్రం: మంత్రి సుబ్రమణియన్‌ 
ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో డెల్టా ప్లస్‌ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు ప్రజా సంక్షేమశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ పరిశోధనా కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. చెన్నై గిండీలోని ఎంజీఆర్‌ వర్సిటీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రూపు మార్చుకుంటున్న కరోనా గుర్తించేందుకు ఇక్కడ పరిశోధనలు చేస్తారన్నారు. ఇక తమిళనాడుకు కొత్తగా మంజూరైన 11 వైద్యకళాశాలల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. వీటిని వచ్చే విద్యాసంవత్సరంలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాని, సిద్ధవైద్య యూనివర్సిటీ స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

డెల్టాప్లస్‌ సోకిందన్న అనుమానంతో 1000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి బెంగళూరు లాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. వీరిలో 10 మందికి డెల్టాప్లస్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందా..? రాదా..? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు నాగరాజన్‌ నీట్‌ ప్రవేశపరీక్షను అడ్డుపెట్టుకుని రాజకీయలబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తి ఏకే రాజన్‌ నేతృత్వంలోని నీట్‌ ప్రవేశపరీక్ష సాదకబాధకాలపై ఏర్పాటు చేసిన కమిటీకి ప్రజల నుంచి ఇప్పటి వరకు 86,342 విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమి టీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. బీజేపీ దాని మిత్రపక్షాలు నీట్‌ ప్రవేశపరీక్షపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న నీట్‌ కేసు జులై 5వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు. 

చదవండి: థర్డ్‌ వేవ్‌ ప్రిపరేషన్‌: కేంద్రం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు