World Cup 2023 finals: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్‌!

18 Nov, 2023 19:48 IST|Sakshi

ప్రపంచమంతా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్‌ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది.  నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు.

1983లో తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్‌ పట్టి వారితో సరదాగా క్రికెట్‌ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్‌ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్‌నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు.

దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. భారత్‌లో క్రికెట్‌ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్‌ కప్‌ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్‌ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్‌ ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్‌ చేసిన ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్‌, లైక్స్‌ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు.

మరిన్ని వార్తలు