World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్‌కప్‌ టీమిండియాదే.. ఎలా అంటే?

18 Nov, 2023 17:34 IST|Sakshi

మూడో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌కు టీమిండియా మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌-భారత్‌ జట్లు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. 

తుదిపోరులో ఆసీస్‌ను చిత్తు చేసి.. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన వరల్డ్‌కప్‌ ఫీవరే కన్పిస్తోంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు  అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఓ పాత సెంటిమెంట్‌ను అభిమానులు తెరపైకి తెచ్చారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

ఆ సెంటిమెంట్‌ ఏంటంటే?
ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు భారత్‌-ఆస్ట్రేలియా కెపెన్లు రోహిత్‌ శర్మ, కమ్మిన్స్‌ అహ్మాదాబాద్‌లోని ప్రఖ్యాత అదాలజ్ స్టెప్‌వెల్‌ వద్ద ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో ట్రోఫీకి కుడివైపు రోహిత్‌ శర్మ ఉండటంతో.. టీమిండియాదే వరల్డ్‌కప్‌ అని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

ఎందుకంటే.. గత మూడు వరల్డ్‌కప్ టోర్నీల్లో కూడా ఈ విధంగా కూడివైపు ఉన్న కెప్టెన్లే తమ జట్టును విజేతగా నిలిపారు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు కూడా ట్రోఫీతో కెప్టెన్లు ఫోటోలు దిగినప్పుడు భారత సారథి ఎంఎస్‌ ధోని.. ట్రోఫీకి కుడి వైపే నిలుచుని ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అనంతరం 2015 ప్రపంచకప్‌లో కూడా అచ్చెం ఇదే పరిస్థితి. ట్రోఫీతో ఫోజులిచ్చేటప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ కూడా కుడివైపే ఉన్నాడు. ఆ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ విశ్వవిజేతగా నిలిచింది.

ఆ తర్వాత చివరగా 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కూడా ట్రోఫీకి కుడివైపే ఉన్నాడు.  2019 ప్రపంచకప్‌ను ఇంగ్లీష్‌ జట్టు ఎగరేసుకుపోయింది. ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా ట్రోఫీకి కుడివైపే ఉండడంతో భారత జట్టు కప్పు కొడుతుందని ఫ్యాన్స్‌ గట్టిగా నమ్ముతున్నారు.
చదవండి: World Cup 2023 Final: ఆసీస్‌తో ఫైనల్‌ పోరు.. సిరాజ్‌కు నో ఛాన్స్‌!? జట్టులోకి సీనియర్‌ ఆటగాడు

మరిన్ని వార్తలు