ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

19 Oct, 2021 07:14 IST|Sakshi

మూడు రోజుల్లో 40 శాతం మేర పెరిగిన ధరలు 

మరో రెండు నెలలు ఇలానే ఉండొచ్చంటున్న వ్యాపారులు 

వాషి ఏపీఎంసీ హోల్‌సేల్‌ మార్కెట్‌కు భారీగా తగ్గిన సరఫరా 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ వర్షాల వల్ల వేల హెక్టార్లలో సాగైన కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూరగాయల పంటలు నీటిలోనే ఉన్నాయి. ఫలితంగా కూరగాయల కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి. నవీ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ)లోకి రాష్ట్రం నలుమూలలతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూరగాయల లోడుతో ట్రక్కులు, టెంపోలు వస్తాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా కూరగాయల ధరలు 40 శాతం మేర పెరిగాయి. ఈ ధరలు మరో నెల, రెండు నెలల పాటు ఇలాగే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు.

చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు)

నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్, లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే ఉన్నాయి. కరోనా మహమ్మారికి భయపడి డ్రైవర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అయితే, ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతోంది. ఇదేసమయంలో ఇప్పటివరకు స్థిరంగా ఉంటూ వచ్చిన కూరగాయల ధరలు గత రెండు, మూడు రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్‌ మొదటి వారంలో కురిసిన అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. రైతులు 30 టన్నుల కూరగాయలు పండించాల్సి ఉండగా, ప్రస్తుతం 13–15 టన్నుల మేర మాత్రమే సాగు చేస్తున్నారు. దీంతో వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు ప్రతీరోజు 600–650 ట్రక్కులు కూరగాయల లోడుతో రావాల్సి ఉండగా, గత కొద్దిరోజులుగా 500 ట్రక్కుల వరకు మాత్రమే వస్తున్నాయి.

ఫలితంగా వాషిలోని ఏపీఎంసీ హోల్‌సేల్‌ మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడింది. దీని ప్రభావం కూరగాయల ధరలపై పడింది. ఇప్పటికే ముంబైలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కూరగాయలు ధరలు కూడా తోడు కావడంతో సామాన్య జనం ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. మొన్నటి వరకు రూ. 20–25 ధర పలికిన కేజీ టమాటలు ఇప్పుడు రూ. 40 పలుకుతున్నాయి. బెండకాయలు కేజీ రూ. 45, కొత్తిమీర కట్ట రూ. 45, మెంతికూర కట్ట రూ. 30, చిక్కుడుకాయ కేజీ రూ. 50, క్యాప్సికం రూ. 40, గ్రీన్‌ పీ నట్‌ రూ. 100, ములక్కాడలు కేజీ రూ. 60 ధర పలుకుతున్నాయి. కాగా, కొద్దిరోజుల కిందటి వరకు టమాటకు గిట్టుబాటు ధర రాక రైతులు టమాట పంటను నడిరోడ్డుపై పోసి నిరసన తెలిపిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ, ఇప్పుడు టమాటలకు మంచి ధర పలుకుతుండటంతో రైతుల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు