పంట.. నీటిపాలు 

7 Dec, 2023 05:01 IST|Sakshi
ఖమ్మం జిల్లా మేడేపల్లిలో తుపాను ధాటికి నేల వాలిన వరి పనలను చూస్తున్న రైతు పోతునూక వెంకటయ్య

అనేక జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం 

కోతకొచ్చిన వరి.. గాలివానలకు నేలకొరిగింది 

నష్టంపై అంచనా వేస్తున్న వ్యవసాయశాఖ 

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మంవ్యవసాయం/సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వర్షాలతో చేతికొచ్చిన పంటలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మిర్చితోపాటు టమాటా, వంగ, బీర, బెండ తోటలు కూడా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న వరి తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి పంట కూడా నేల రాలింది. నష్టంపై వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని అధికారులు చెబుతున్నారు.  

రంగుమారుతున్న పత్తి.. 
ప్రస్తుతం పత్తి తీతలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, వానలతో పత్తి నేలరాలిపోతోంది. రంగు మారి నాణ్యత కోల్పోతుండగా, కాయలోకి నీరు దిగి పత్తి నల్లబడుతోంది. పత్తి తీతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. వర్షానికి తడిసిన పత్తి బరువు కూడా తగ్గుతుంది. ఇక పత్తిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం రెండో తీతలో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు చేతికందే దశలో ఉంది. తుపాను కారణంగా ఈ పత్తి చేతికందుతుందా లేదా అనేది రైతుల్లో ఆందోళనగా ఉంది. ఒకవేళ తుపాను ప్రభావం తగ్గినా ప్రస్తుత పరిస్థితుల్లో చేతి కందే పత్తి బరువు తగ్గి 4 క్వింటాళ్లకు ఒక క్వింటా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.  

నేలవాలుతున్న వరి.. 
వానకాలం వరి కోతలు సగమే పూర్తయ్యాయి. ఇంకా ఆయా జిల్లాల్లో కోతలు కొనసాగుతున్నాయి. వరి కోత, నూర్పిడి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో ధాన్యం కల్లాల్లో ఆరబెడుతున్నారు. కోత దశలో ఉన్న వరి ఈదురుగాలులు, తుపాను కారణంగా కంకి బరువుకు నేలవాలుతోంది. గాలులకు ఆరిపోయి ఉన్న కంకుల నుంచి గింజలు నేలరాలిపోతున్నాయి. ఇక నేలవాలిన కంకులు తేమ కారణంగా మొలకొచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇక నేలవాలిన వరిని యంత్రాలు కోయటం అంతగా సాధ్యం కాదు. కూలీలతో వరికోతలు జరిపించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు పంట నేలవాలి కొంత దెబ్బతినగా, మరో వైపు కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడులు మరింతగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కల్లాల్లో ఆరబెట్టిన రైతులు రాశులుగా చేసి టార్పాలిన్లను కప్పి రక్షించుకునే పనిలో ఉన్నారు. తేమతో ఉన్న ధాన్యం రాశులు నాణ్యత కోల్పోతాయని రైతులు దిగులు చెందుతున్నారు. రెండు రోజులు తుపాను కొనసాగితే రాశుల్లో మొలకొచ్చే ప్రమాదం కూడా ఉందని రైతులు చెబుతున్నారు. 

మిర్చిని అదే పరిస్థితి... 
కాత దశలో ఉన్న మిర్చి పైర్లు నేలవాలే ప్రమాదం ఉంది. మిర్చి కాయబరువుతో చెట్టు పడిపోతుందని రైతులు చెబుతున్నారు. అక్కడక్కడ తొలి కోతలు కూడా సాగుతున్నాయి. కోసిన మిర్చి ఆరబెట్టకుండా రాశులుగా కల్లాల్లో ఉంచితే తేమబారిన పడి నాణ్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తేమతో ఉన్న కాయకు నల్లమచ్చ ఆశించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు మాత్రం రైతులను నష్టపరుస్తున్నాయే తప్పా ప్రయోజనం కలిగించటం లేదని అన్నదాతలు వాపోతున్నారు.  
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగానే నష్టం 
ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,191 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో అధికంగా వరి 59,307 ఎకరాల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు.  

► భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 7,450మంది రైతులకు సంబంధించిన 13,608 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు ధ్వంసమైనట్లు అంచనావేశారు. ప్రస్తుతం అధికారులు అంచనాల్లో నిమగ్నం కాగా.. ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టంపై స్పష్టత రానుంది.  
► వాజేడు మండలంలో ప్రత్యేకాధికారి సర్ధార్‌ సింగ్‌ ఆధ్వర్యంలో అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఏటూరునాగారంలో పోలీస్‌ విపత్తు దళం ముళ్లకట్ట వద్ద హైపవర్‌ బోటులో రీహార్సల్‌ చేపట్టింది. 

చనిపోయిన 13వేల బాతులు...గుండెపోటుతో యజమాని మృతి 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి ఏపీలోని జగ్గయ్యపేట మండలానికి చెందిన పేరం ఆదిలక్ష్మి (67) కుటుంబ సభ్యులతో కలిసి బాతులను తీసుకొచ్చి పెంచుతున్నారు. తుపాన్‌ ప్రభావంతో తడిచిన 13వేల బాతు పిల్లలు మృతి చెందడంతో యజమాని ఆదిలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు.  

పరిహారం ఇవ్వాలి: తెలంగాణ రైతు సంఘం 
రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 40 వేలు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్‌ కోరారు.  

వేలాది ఎకరాల్లో పంటలు తడిసి ముద్దయ్యాయి: కూనంనేని 
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. పత్తి, మిర్చికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకు రూ. 20 వేలు, కూరగాయలకు ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు.  

>
మరిన్ని వార్తలు