Video Viral: మహిళా ప్రయాణికురాలిపై బస్‌ కండక్టర్‌ దాడి

27 Mar, 2024 20:14 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ బస్‌ కండక్టర్‌.. ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళపై చేయిచేసుకున్నాడు. ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ రంగంలోకి దిగింది. సదరు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది.

వివరాలు.. కొత్తనూర్‌ డిపోకు చెందిన బీఎమ్‌టీసీ బస్సులో మంగళవారం  ఓ మహిళ ప్రయాణించింది. బస్సు బిలేకహళ్లి నుంచి శివాజీనగర్‌ వెళ్తోంది. టికెట్‌ తీసుకునే విషయంలో కండక్టర్‌ హోన్నప్ప నాగప్ప అగసర్‌కు మహిళా ప్రయాణికురాలికి మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో మొదట మహిళ కండక్టర్‌పై చేయి చేసుకోగా.. అనంతరం కండక్టర్ ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు.  మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దానిని బస్‌లోని మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వేరే రాష్ట్రానికి చెందిన మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది.. టికెట్‌ తీసుకునే విషయంలో బస్‌ కండక్టర్‌తో వాగ్వివాదం జరిగింది. ఆ వాదన పెరిగి పెద్దదైంది.. ఈ క్రమంలో కండక్టర్‌ ఆమెపై దాడి చేశాడు.  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో.. కండక్టర్‌ హొన్నప్ప నాగప్ప అగసర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాం. తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని పేర్కొంది. మరోవైపు కండక్టర్‌పైఓ మహిళా ప్రయాణికురాలు సిద్దాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Election 2024

మరిన్ని వార్తలు