పెద్దలను ముట్టుకోరు... పేద రైతులపైనే ప్రతాపం

17 May, 2022 05:21 IST|Sakshi

బ్యాంకుల తీరుపై సుప్రీం విమర్శలు

న్యూఢిల్లీ: బ్యాంకుల పనితీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘భారీ మొత్తాల్లో రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలను నిలదీయడానికి, వాళ్లమీద కేసులు పెట్టడానికి మీకు చేతులు రావు. పేద రైతులను మాత్రం వెంటపడి వేధిస్తారు’’ అంటూ తప్పుబట్టింది. మోహన్‌లాల్‌ పటీదార్‌ అనే రైతు తీసుకున్న రుణానికి సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తీరును తీవ్రంగా తప్పుబడుతూ సునిశిత విమర్శలు చేసింది. ‘‘పెద్దవాళ్లు తీసుకునే భారీ రుణాల వసూలుకు మీరు ప్రయత్నం చేయరు. రైతుల విషయంలో మాత్రమే మీకు చట్టం గుర్తొస్తుంది. ఓటీఎస్‌ పథకం కింద రూ.36.5 లక్షలు కట్టాలని ఆ రైతుకు మీరే ఆఫర్‌ చేశారు. అతను 95 శాతం పైగా చెల్లించాక కట్టాల్సిన మొత్తాన్ని రూ.50.5 లక్షలకు పెంచారు. పైగా దాన్ని వసూలు చేసుకునేందుకు కోర్టుకెక్కారు.

మేమలాంటి ఏకపక్ష నిర్ణయం వెలువరించే సమస్యే లేదు. అది అర్థరహితమే కాదు, సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం’’ అంటూ తలంటింది. కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పు ఇస్తే అది అందరికీ సాకుగా మారుతుందన్న బ్యాంకు తరఫు న్యాయవాది గరిమా ప్రసాద్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. బ్యాంకు విజ్ఞప్తిని అంగీకరిస్తే పేద రైతు ఆర్థికంగా చితికిపోతాడని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆందోళన వెలిబుచ్చారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు