వరల్డ్‌కప్‌ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు

19 Nov, 2023 16:04 IST|Sakshi

World Cup final: ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆతిథ్య భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్‌ మ్యాచ్‌ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ఫైనల్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర విమర్శలు చేశారు.

అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ క్రికెట్‌ ఈవెంట్‌ కంటే కూడా బీజేపీ ఈవెంట్‌లా సాగుతోందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్‌ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు.

"క్రికెట్‌లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్‌లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్‌ కచ్చితంగా కప్‌ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు