ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం

14 Jan, 2024 08:33 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్‌, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. 

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన  చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. 

దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో ఈ సీజన్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది.

ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!

>
మరిన్ని వార్తలు