హాంగ్‌కాంగ్‌లో భలేగా బుజ్జాయిలతో భోగి!

19 Jan, 2023 15:32 IST|Sakshi

తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. మన పండుగలకు చాలా సామాజిక, సాంప్రదాయ, సాంస్కృతిక మరియు స్వాభావికమైన ఆరోగ్య విలువలు ఉంటాయి. ఈ  పండుగలలో పెద్దల ఆశీర్వదిస్తారు. పిల్లలు మహా సందడిగా ఉంటారు.


ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. భోగిపళ్లలో, చెర్రీస్, శనగలు, చేమంతి, బంతి, గులాబీ  పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు. పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలూ, పసుపు-కుంకుమలూ పెట్టడం ఆనవాయితీ. అయితే ప్రవాస భారతీయులుగా పండుగకు కావాల్సినవన్ని వారున్న దేశంలో సమకూర్చుకోలేకపోయినా, లభ్యమైన వాటితోనే వారు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. 


హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి యేట రెట్టింపు వుత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పండుగ వివరాలు తెలుపుతూ, వారి పాపకి భోగి పండ్లు సంధర్భంగా, తమ ఎస్టేట్ లో వున్న మరి కొంత మంది పసి పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో భోగి’ చేయడం మొదలుపెట్టగా, భగవంతుని ఆశశీస్సులతో రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు తమకు ఎంతో ఆనందాన్ని తృప్తినిస్తోందని  తెలిపారు. 


హాంగ్‌కాంగ్‌లో ‘డూడు బసవన్నలు’ మరియు ‘గంగిరెద్దుల ఆటలు’ కనిపించక పోయినా,  ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ‘బుజ్జాయిలతో భోగి’ సందడి క్రిస్మస్ సెలవల నుంచే మొదలవుతుంది. సెలవలకి భారతదేశం వెళ్ళినప్పుడు, రానున్న సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, క్రొత్త బట్టలు, నగలు, బొమ్మలు మొదలగునవి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అమ్మల పట్టు చీరలు, తళ  తళ మెరిసే మేలిమి నగలు, నాన్నల పంచే సర్దుకొంటూ పిల్లల వెంట పరుగులు, చిన్నారుల క్రొత్త బోసి నవ్వులు - కేరింతలు, పిల్లల కాలి మువ్వల సవ్వడులుతో పండుగ వాతావరణానికి ఆహ్వానాలుగా ధ్వనిస్తాయి. 

అమ్మమ్మలు - బామ్మలు - తాతయ్యల మురిపాల నవ్వులు, సంతోషాలు ఆ భోగిపళ్ళ సందడికే ప్రకాశాన్నిస్తున్నాయి.. అందరూ భోగిపళ్ళతో సమావేశంకాగా అమ్మమ్మ - బామ్మల హస్తాల మీదుగా దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా, హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని శ్రీమతి హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు వారు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించగా, తల్లి తండ్రులందరు వరుసగా పిల్లలందరికి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు.   
 
పిల్లలందరికి మరింత ఆసక్తి ఉత్సాహాన్ని ఇచ్చేది, పాల్గొంటున్న వారిచ్చే చిరు కానుకలు. వాటిని పుచ్చుకునేందుకు పిల్లల అరుపులు, కేకలు , పరుగులు ఎంత ముచ్చటగా వుంటాయో కదా. మరి కానుకలు అందుకున్న తరువాత వాటిని విప్పి చూసే హడావిడి మీ ఊహకే అంటున్నారు సంతోషంగా,  ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక.  ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరొక్క మంచి మాట, హాంగ్‌కాంగ్‌లో కూడా మన దేశంలో సంక్రాంతికి గాలి పటాల పోటీల వలె ఇక్కడ జాతీయ - అంతర్జాతీయ గాలి పటాల పోటీలు నిర్వహిస్తుంటారు.. మీకు తెలుసా, గాలిపటాలు ఎగురవేయడం హాంగ్‌కాంగ్, చైనాలో ఒక ప్రసిద్ధ కాలక్షేపం. మొదటి గాలిపటం షాన్‌డాంగ్‌లో సన్నని చెక్క ముక్కలతో తయారు చేయబడిందని నమ్ముతారు. చైనీస్ గాలిపటాల నమూనాలు ఎక్కువగా జానపద కథలు మరియు బొమ్మలపై ఆధారపడి ఉంటాయి. మీరు తరచుగా డ్రాగన్‌లు, పువ్వులు, గోల్డ్ ఫిష్, సీతాకోకచిలుకల వంటి ఐకానిక్ చిహ్నాలు మరియు డిజైన్‌లను చూసివుంటారు. ఇలా అనేక దేశాలలో గాలిపటాలు ఎగురవేయడం ప్రసిద్ధి చెందింది - భారతదేశం, నేపాల్, ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్, చైనా, జపాన్, తైవాన్, గ్రీస్, సైప్రస్, దక్షిణ అమెరికా, పాలినేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్. (క్లిక్ చేయండి: బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు)

మరిన్ని వార్తలు