ప్రయాణం మధ్యలో పాజిటివ్‌. అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు

22 Jan, 2022 10:21 IST|Sakshi

దేశం కాని దేశంలో ప్రయాణం మధ్యలో చిక్కుకుని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ లేక ఫోన్లు కలవక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా మార్గమధ్యలో వచ్చిన కరోనానే అందుకు కారణం. 

టొరంటో వెళ్తూ
హైదరాబాద్‌కి చెందిన సయ్యద్‌ ఓమర్‌ అజామ్‌ అనే వ్యక్తి ఇండియా నుంచి కెనడాలోని టోరంటో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అక్కడున్న గేట్‌ నంబర్‌ 28 దగ్గరే అతన్ని గంటల తరబడి ఉంచారు. దీంతో సాయం చేయాలంటూ ట్విట్టర్‌ వేదికగా అతను కోరాడు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అతన్ని ఐసోలేషన్‌లో భాగంగా ఆల్‌ రజీమ్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. లగేజీ ఇతర ముఖ్యమైన వస్తువులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాయి. అక్కడి అధికారులు ఎవరితో పెద్దగా కలవనివ్వడం లేదంటూ మరో ట్వీట్‌ చేశారు అజామ్‌

మరింత మంది
అజామ్‌ ట్వీట్‌కి క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మరో భారతీయుడు కూడా స్పందించాడు. మనిద్దరమే కాదు అనేక మంది ఈ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్నారని.. ఇక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ తెలిపాడు. చివరకు ఆల్‌ రజీమ్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదా స్వదేశానికి వచ్చే విధంగా సాయం చేయాలంటూ వారు విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌ ద్వారా సాయం కోరారు.  

సాయం చేయండి
ఇండియా నుంచి యూరప్‌, అమెరికాకు వెళ్లే అనేక మంది దుబాయ్‌, అబుదాబిలో కనెక్టింగ్‌ ప్లైట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. విమానం ఎక్కే ముందే కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ చూపించే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యంలో చేసే పరీక్షల్లో పాజిటివ్‌గా తేలుతున్నారు. దీంతో అజామ్‌ తరహాలో అనేక మంది దుబాయ్‌, అబుదాబిలలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వారికి అవసరమైన సాయం అందించే విషయంలో ముందుకు రావాలని కోరుతున్నారు.

చదవండి: ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్‌ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం

మరిన్ని వార్తలు