హాంగ్‌ కాంగ్‌లో ఘనంగా కార్తీక మాస పూజ, వనభోజనాల సందడి!!

28 Nov, 2021 20:08 IST|Sakshi

హాంగ్‌ కాంగ్‌లో కార్తీక మాసం నాడు దీపావళి సంబరాలు, భాయ్‌ దూజ్‌(భాగిని హస్త భోజనం), కందషష్టి పూజలను తమిళ సంఘం వారు నవంబర్‌ 4 నుంచి 10 వరకు ఎంతో వైభవంగా జరిపించగా, హాంగ్‌ కాంగ్‌ తెలుగు సమాఖ్య వారు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం, వనభోజనం నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం హాంగ్‌కాంగ్‌కి వచ్చే తెలుగు వారిలో సాధారణంగా యువ జంటలు ఎక్కువగా ఉంటారు. వీరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోవాలనుకున్నా ఇక్కడ తెలుగు పురోహితులు లేనందుకు నిరాశ చెందేవారు. ఈ విషయాన్ని సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటీ తమ సభ్యులతో చర్చించగా శ్రీ పత్రి భీమసేన తాము చేయిస్తామని స్వచ్చందగా ముందుకు వచ్చి ప్రతి సంవత్సరము కార్తీక మాసం లేదా మాపు మాసంలో తప్పకుండా వ్రతం చేయిస్తున్నారు. వారు హాంగ్‌కాంగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు. 

దేశం కాని దేశంలో ఉన్న తెలుగు యువ జంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని సంకల్పం కలగటం ప్రశంసనీయమైన విషయం! పట్టు వదలకుండా కొన్ని సంవత్సరాలుగా వీరి సంకల్పాన్ని సార్థక పరచటం లో విజయాన్ని సాధిస్తున్న శ్రీమతి జయ ప్రయత్నం మరింత ప్రశంసనీయం అన్నారు శ్రీ భీమసేన గారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడ ఎంతో శ్రద్దా భక్తులతో వ్రతం చేసుకున్న యువ జంటలకు మా హార్దిక శుభాకాంక్షలు. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కారానికి లొంగిపోయిన యువతలో పూజ చేసే సరైన సదుపాయం లేని హాంగ్‌ కాంగ్‌లో ఈ పూజ చెయ్యాలని సంకల్పించి పూజ సామాగ్రిని ప్రయాసతో సమకూర్చుకొన్న ఈ జంటలకి, పూజ సక్రమంగా జరగటానికి దోహద పడిన స్వచ్చంద సేవకులకు హార్దిక అభినందనలు తెలిపారు.

ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్ట చేయించి, నవగ్రహాల ఆవాహనం ప్రతి గ్రహానికి అష్టోత్తర పూజ, అష్ట దిక్పాల పూజ మొదలైన వాటి తర్వాత, లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ ప్రతిమలకు రూపులకు పురుషసూక్త స్త్రీ సూక్త భూసూక్తాలతో అభిషేకం, పిమ్మట సత్యనారాయణ అస్టోత్తరం, సత్యనారాయణ స్వామి ప్రసాదాలు నైవేద్యం పెట్టించి వ్రత కధలు అయిదు చెప్పి, పునః పూజ తరువాత మహా నైవేద్యం, హారతితో పూజ సంపూర్ణం కాగా అందరూ ఎంతో భక్తితో ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తమ ఇళ్లకు తరలి వెళ్లారు.

వీరందరూ ఎంతో ఏకాగ్రతతో మూడు గంటలసేపు కుటుంబ సమేతంగా పూజ చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కటాక్షాన్ని పొందారు. హిందు దేవాలయ సిబ్బంది సహకారంతో పూజామంటపాన్ని చాలా అందంగా అలంకరించిన సేవకులకు కృతజ్ఞతలు. ఈ పూజ కలకాలం నిరాటంకంగా కొనసాగాలని, అందరి సత్సంకల్పాలు దివ్యంగా నెరవేరాలని, ప్రపంచమంతా అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్ధించడం జరిగింది. 2018 లో కార్తీక వనభోజనం తర్వాత, 2019లో నిరసనలు & 2020లో కోవిడ్‌ కారణంగా ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. రెండు ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కార్తీక వనభోజనాలని సభ్యులందరు ఎంతో ఆనందోత్సాహాలతో కలిసి జరుపుకున్నారు. 

అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారికి, అలాగే పెళ్లిరోజు ప్రధమ వార్షికోత్సవం జరుపుకుంటున్న యువ జంటతో పాటు మరొక జంట తమ పన్నెండవ పెళ్లిరోజుని ఎంతో సంబరంగా తెలుగు వారందరితో జరుపుకున్నారు. ది హాంగ్‌ కాంగ్‌ తెలుగు సమాఖ్య వారిది ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉందని, క్రొత్తగా హాంగ్‌ కాంగ్‌ వచ్చిన వారిని తమ పరిచయాలు తెలుపమని, తద్వారా వారికి క్రొత్త స్నేహితులు ఏర్పడటానికి అవకాశం కల్పించడం సమాఖ్య ముఖ్యోద్దేశమని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటీ తెలియజేశారు. రానున్న సంవత్సరంలో తమ సంస్థ తలపెట్టిన కార్యక్రమాల విషయాలను ప్రస్తావిస్తూ, యువతరం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు, భాద్యతలు కూడా చేపట్టాలని ప్రోత్సహించారు. ఎంతో కాలం తరువాత, ఇలా దేశం కానీ దేశంలో కార్తీక మాసంలో వనభోజనాలలో బంతి భోజనం చేయడం తమకేంతో ఆనందాన్నిచ్చిందని అందరూ తెలిపారు.

మరిన్ని వార్తలు