ఫోర్జరీ కేసులో వ్యక్తి అరెస్టు

1 Jun, 2023 02:08 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తహసీల్దార్‌ సంతకం పోర్జరీ చేసిన కేసులో యూట్యూబర్‌ మేకల భానుమూర్తిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. తహసీల్దార్‌ ఎం.సూర్యారావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యూట్యూబర్‌ భానుపై గతంలో కూడా భూకబ్జా, బెదిరింపులు తదితర అనేక కేసులు నమోదయ్యాయి. గతంలో పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ పరిణామాల మధ్య కోర్టులో హాజరు పర్చేందుకు ఎస్‌ఐ పాపారావు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ విజయవాడ తీసుకెళ్లారు.

హత్యాయత్నం

కేసులో నిందితుల అరెస్టు

పెనమలూరు:భర్త పై హత్యాయత్నం చేసిన కేసులో భార్యతో పాటు పది మంది వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ ఎం.కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గోసాల గ్రామానికి చెందిన పోలాని కిరణ్‌ గత 14 సంవత్సరాల క్రితం రమాదేవిని వివాహం చేసుకున్నాడు. కిరణ్‌ పలు నేరాలు చేయటంతో జైలుకు వెళ్లాడు. అతను గత నెల రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే అతని భార్య రమాదేవికి వణుకూరుకు చెందిన ఉయ్యూరు మహేష్‌కు సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించాలని రమాదేవి హత్యకు పథకం వేపింది. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన భర్త విజయవాడలో ఉండగా కిడ్నాప్‌ చేయించి వణుకూరుకు తీసుకొచ్చింది. ఆ తరువాత అతని పై పలువురు వ్యక్తులతో దాడి చేయించి కత్తితో గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య రమాదేవి, ఉయ్యూరు మహేష్‌, పఠాన్‌ సుభాని, పఠాన్‌ హైదర్‌ఆలి, జి.షాలిమ్‌రాజు, జి.సతీష్‌, పఠాన్‌ బాజి, ఎ.వీరవెంకటమోహన్‌, పోతురాజు రాము, ఎ.దుర్గాప్రసాద్‌, వాటపల్లి లీలాప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఫోన్‌ పే చేస్తానంటూ రూ.73 వేలు మాయం

కంచికచర్ల : కంచికచర్లలో ఓ దుకాణదారుడి నుంచి గుర్తు తెలియని యువకుడు రూ.73 వేలు కాజేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీవీఎస్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని వస్త్ర దుకాణంలో ఓ యువకుడు వచ్చి 15 లుంగీలు, 15 టవల్స్‌ కావాలని దుకాణ యజమాని జూలూరు శ్రీనివాసరావును అడగ్గా వాటిని తీసి ఇచ్చాడు. ఆ యువకుడు వాటిని పక్కన పెట్టి తమ మామయ్య ఫోన్‌పే చేస్తామని అన్నాడు. నీ సెల్‌ నుంచి ఒక్క రూపాయి మామయ్యకు ఫోన్‌పే చేయమని యజమానిని కోరాడు. దీంతో యజమాని తనకు ఫోన్‌పే చేయటం రాదు నీవే చేయమని ఆ యువకుడికి ఫోన్‌ ఇచ్చి పిన్‌ నెంబర్‌ చెప్పాడు. నమ్మకంగా రూపాయి ఫోన్‌పే చేసాడు. అనంతరం దుకాణదారుని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 73 వేలను వెంటనే వేరొక సెల్‌ఫోన్‌కు ఫోన్‌పే చేశాడు. ఇప్పడే వస్తామని చెప్పి ఆ యువకుడు ఉడాయించాడు. బయటకు వెళ్లి చూడగా ఆ పరిసర ప్రాంతంలో కనిపించకుండా వెళ్లిపోయాడు. లబోదిబోమంటూ ఆ దుకాణదారుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు