నవీన్‌ సోదరి గీతా మెహతా కన్నుమూత

18 Sep, 2023 11:26 IST|Sakshi

 భువనేశ్వర్‌/కొరాపుట్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోదరి గీతా మెహతా (80) శనివారం రాత్రి న్యూఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు పరోక్ష సంతాప సూచకంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి నవీన్‌ ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న దృశ్యాలు ప్రజలు టీవీల్లో వీక్షించారు.

గాంధీ కుటుంబంతో స్నేహం..
దివంగత ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌కు ఇద్దరు కుమారులు ప్రేమ్‌ పట్నాయక్‌, నవీన్‌ పట్నాయక్‌, ఒక కుమార్తె గీతా ఉన్నారు. వీరందరి బాల్యం లండన్‌లో జరిగింది. ప్రేమ్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా, గతంలోనే మృతిచెందారు. గీతా అంతర్జాతీయ కవయిత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. బిజూ సంతానినికి బాల్యంలో గాంధీ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉండేవి.

చివరి చూపు కోసం..
నవీన్‌ న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ అక్క చివరి చూపు కోసం ఢిల్లీ వచ్చానని ప్రకటించారు. కాగా, నవీన్‌ ఉండగా ఏనాడూ అతని కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు నవీనే ఢిల్లీ వెళ్లి అక్కని చూసేవారు. గీత మృతిలో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గీతా మెహతా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

ఘన చరిత్ర..
దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ కుమార్తె గీతా మెహతా రచయిత్రిగా, లఘు చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్‌గా పేరొందారు. ప్రఖ్యాత అమెరికన్‌ పబ్లిషర్‌ దివంగత సోనీ మెహతాను 1965లో గీతా మెహతా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో బిజు, జ్ఞాన్‌ పట్నాయక్‌ దంపతులకు 1943లో జన్మించిన ఆమె తన విద్యను భారత్‌తో పాటు యూకే కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2019లో భర్త సోనీ మెహతా మరణించినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

► కర్మ కోలా, స్నేక్‌ అండ్‌ ల్యాడర్స్‌, ఎ రివర్‌ సూత్ర, రాజ్‌ అండ్‌ ది ఎటర్నల్‌ గణేషా అనే మూడు పుస్తకాలను రచించారు.

► తన రచనలలో భారత చరిత్ర, సంస్కృతి, మతాన్ని చిత్రీకరించారు. ఈమె రచనలు 13 భాషల్లోకి అనువాదమయ్యాయి. 27 దేశాలలో ప్రచురితమయ్యాయి. యూకే, యూరోపియన్‌ దేశాలు , యునైటెడ్‌ స్టేట్స్‌ కోసం 14 బుల్లి తెర లఘు చిత్రాలను మెహతా నిర్మించి దర్శకత్వం వహించారు.

► 1970లలో నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీకి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు గీత యుద్ధ ప్రతినిధిగా పని చేశారు. యూఎస్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎన్‌బీసీ కోసం గీతా మెహతా బంగ్లాదేశ్‌ యుద్ధాన్ని కవర్‌ చేశారు. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంపై డేట్‌లైన్‌ బంగ్లాదేశ్‌ పేరుతో శక్తివంతమైన డాక్యుమెంటరీని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీలో పాకిస్తాన్‌ సైనికులు చేసిన మారణహోమం, కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసిన విముక్తి యుద్ధాన్ని చిత్రీకరించారు.

ప్రముఖుల సంతాపం..
గీతా మెహతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతా మెహతా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె మరణం అత్యంత బాధాకరమన్నారు. గీతా మెహతా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు