సామాజిక చైతన్యానికి వెంకటరాయలు కృషి

27 Mar, 2023 01:46 IST|Sakshi
మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌

చిలకలూరిపేట: జీవిత కాలం సామాజిక చైతన్యానికి కృషి చేసిన రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ దివంగత తోటకూర వెంకటరాయలు పేరున ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కల్యాణ మండపంలో వెంకటరాయ, శ్రీధర్‌ ఫౌండేషన్‌ ప్రారంభోత్సవంలో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మన వేదాల్లో గురువుకు భగవంతుని పక్కన చోటు దొరికిందని, తోటకూర వెంకటరాయలు అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థుల మెప్పు పొంది, ఆ నానుడి నిజం చేశారని కొనియాడారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామీణ విద్యార్థులు ఇంగ్లిష్‌ స్కిల్స్‌లో సాధించేందుకు ఫౌండేషన్‌ దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ నివారణ ఉద్యమంలో కీలక భూమిక పోషించగలదని అభిలషించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని వృత్తుల్లోకెల్లా అధ్యాపక వృత్తి ఎంతో అత్యుత్తమమైనదని, వెంకటరాయలు జీవితాంతం వృత్తి ధర్మాన్ని పాటించారని కొనియాడారు. ప్రత్యేక అతిథి బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ, అనస్థీషియా చీఫ్‌ డాక్టర్‌ బసంత్‌కుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఫౌండేషన్‌ సంసిద్ధత తెలపడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు తోటకూర శ్రావణ్‌ శ్రీనివాస్‌, కార్యదర్శి తోటకూర వెంకటనారాయణ, తేళ్ల సుబ్బారావు, జాష్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌

మరిన్ని వార్తలు