క్రికెట్‌ బెట్టింగ్‌.. రూ.40 లక్షలు అప్పు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

14 Nov, 2023 19:27 IST|Sakshi
మృతుడు గంగిరెడ్డి (ఫైల్‌)

పల్నాడు: ఆర్థిక బాధలతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీపావళి రోజున నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే, సివిల్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన బద్దూరి గంగిరెడ్డి(33) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈపూరు మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. గత నెల 23న దసరా పండుగ సెలవులపై భార్య, పాపతో అలవాల చేరుకున్నాడు.

ఇటీవల కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్లేందుకు బయలుదేరగా, నాకు పని ఉంది మీరు వెళ్లడంటూ గ్రామంలోనే ఉండిపోయాడు. తనకు కంపెనీ పని ఉందంటూ నాలుగైదు రోజుల క్రితం నరసరావుపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వెళ్లకుండా ఆదివారం ఉదయం 10 గంటలకు ద్విచక్రవాహనంపై సాతులూరు రైల్వే స్టేషన్‌ వద్దకు వచ్చాడు. తన సోదరి సంధ్యకు ఫోన్‌ మెసేజ్‌ పంపాడు. తాను బతకనని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్‌ చేశాడు. ఆతర్వాత కొద్దిసేపటికి సాతులూరు రైల్వే స్టేషన్‌ పట్టాలపై చేరుకున్నాడు.

ఆసమయంలో గుంటూరు–గుంతకల్లు వెళ్లే పాసింజర్‌ కిందపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే లింగారెడ్డి మృతి చెందాడు. రైల్వే కీమెన్‌ కోటేశ్వరరావు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. రైల్వే సీఐ పి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీనునాయక్‌, చిలకలూరిపేట రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, నాదెండ్ల ఎస్‌ఐ జె.బలరామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్టేషన్‌ మాస్టర్‌ కుమారరాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ల కారణంగా నష్టపోయి రూ.40 లక్షలు అప్పులపాలుకాగా తండ్రి లింగారెడ్డి తీర్చాడు. ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభం కావటంతో బెట్టింగ్‌లకు అలవాటు పడి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో కలత చెందిన లింగారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు