యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌

8 Dec, 2023 01:42 IST|Sakshi

సత్తెనపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటింది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఓటు హక్కును 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ కల్పించాలని జిల్లా అధికార యంత్రాంగం నడుంకట్టింది. హక్కు కల్పించడమే కాకుండా దానిని అందరూ వినియోగించుకునేలా చైతన్యం తీసుకొస్తోంది. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసే పనిలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఇప్పటికే ముసాయిదా జాబితా విడుదల చేసింది. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈనెల 9వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీంతో యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని అధికారులు స్వీప్‌ ఓటరు పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ఓట్ల వివరాలను ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌, ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.

జనవరి 5న తుది జాబితా

2023 అక్టోబర్‌ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 17,01,399 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 8,33,923 మంది, మహిళలు 8,67,262 మంది, ట్రాన్స్‌జెండర్లు 214 మంది ఉన్నారు. సర్వీస్‌ ఓటర్లు 1,307 మంది ఉన్నారు. ముసాయిదా విడుదల నాటి నుంచి స్వీకరించిన ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపు దరఖాస్తులను స్వీకరించారు. ఈనెల 9 వరకు స్వీకరించి జనవరి 5న సంపూర్ణ ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.

ఓటు ఉందో లేదో చూసుకోండి

ఎన్నికల సంఘం ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఓటు ఉందో లేదో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు ఓటర్స్‌.ఈసీఐ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సరి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఓటు లేకపోతే ఫారం–6 ద్వారా నమోదు కావాల్సి ఉంది. ఓటర్‌కార్డులో చిరునామా మార్చుకోవాలనుకునేవారు ఫారం–8, పేరు తొలగింపునకు ఫారం –7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవలను పొందేందుకు బీఎల్‌ఓలను సంప్రదించాలి.

● ఓటర్‌ జాబితాలో పేరు ఉందో లేదో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా చూసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుని భాష ఎంపిక చేసుకుని రిజిస్టర్‌ కావాలి.

● పాత ఓటర్‌ కార్డు ముందు భాగంలో బార్‌కోడ్‌ ఉంటుంది. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌లో బార్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే వివరాలు తెలుస్తాయి.

● కొత్తగా జారీ చేస్తున్న కార్డులు క్యూఆర్‌ కోడ్‌తో వస్తున్నాయి యాప్‌లో ఆ కోడ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకొని స్కాన్‌ చేస్తే వివరాలు తెలుస్తాయి.

● తండ్రి పేరు, వయసు, జెండర్‌, జిల్లా, నియోజకవర్గ వివరాలు నమోదు చేసినా ఓటు హక్కు ఉందో లేదో తెలిసిపోతుంది.

● ఓటర్‌ కార్డు నంబర్‌ ఎంటర్‌ చేసినా వివరాలు తెలుస్తాయి.

టీడీపీ దొంగ ఓట్ల రాజకీయం

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న తలంపుతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ ఓట్ల రాజకీయం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు నమోదు చేసుకునేలా టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఓవైపు దొంగఓట్ల ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వైఎస్సార్‌ సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. టీడీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసు కోకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేస్తోంది.

యువత.. ఓటే భవిత

రేపటి వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం మార్పులు, చేర్పులకు రేపే గడువు తేదీ 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జనవరి 5న సంపూర్ణ ఓటర్ల జాబితా ప్రచురణ జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 17,01,399 మంది ఓటర్లు

ముసాయిదా జాబితా ప్రకారం పల్నాడు జిల్లాలో ఓటర్లు ఇలా...

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

పెదకూరపాడు 1,10,062 1,14,485 23 2,24,570

చిలకలూరిపేట 1,07,925 1,17,009 49 2,24,983

నరసరావుపేట 1,11,931 1,16,688 38 2,28,657

సత్తెనపల్లి 1,14,976 1,19,449 17 2,34,442

వినుకొండ 1,28,638 1,29,331 21 2,57,990

గురజాల 1,30,782 1,37,185 43 2,68,010

మాచర్ల 1,29,609 1,33,115 23 2,62,747

మొత్తం 8,33,923 8,67,262 214 17,01,399

పారదర్శకంగా ఓటర్ల జాబితా

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా జాబితాను విడుదల చేశాం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశం. అందుకు అనుగుణంగా కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 9వ తేదీలోగా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. యువతకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.

– బీఎల్‌ఎన్‌ రాజకుమారి,

ఆర్డీవో, సత్తెనపల్లి

>
మరిన్ని వార్తలు