Sakshi News home page

రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించండి

Published Fri, Dec 8 2023 1:42 AM

- - Sakshi

వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు

డొక్కా మాణిక్యవరప్రసాద్‌

గుంటూరు వెస్ట్‌ : ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేసిన కొందరికి మన జిల్లాలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి వినతి పత్రం అందజేశారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో డొక్కా మాట్లాడుతూ రెండు చోట్ల ఉండటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దీని వల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో అత్తోట జోసఫ్‌, అంగడి శ్రీనివాస్‌, షేక్‌ మస్తాన్‌వలి, మాదా రాధాకృష్ణమూర్తి, పాల్గొన్నారు.

10 నుంచి ఆల్‌ ఇండియా క్యారమ్స్‌ టోర్నమెంట్‌

గుంటూరు వెస్ట్‌ ( క్రీడలు ) : ఆల్‌ ఇండియా క్యారమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర క్యారమ్స్‌ సంఘం నిర్వహణలో ఈ నెల 10 నుంచి 13 వరకు విశాఖలో 28వ ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ కప్‌ క్యారమ్స్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని పోటీల నిర్వహణ కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ జలీల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటాయన్నారు. మొత్తం రూ.25 లక్షల వ్యయంతో భారీ స్థాయిలో ఏపీ రాష్ట్ర క్యారమ్స్‌ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సంపతి నేతృత్వంలో నిర్వహిస్తామన్నారు. జిల్లా నుంచి పి.శ్రీనివాసరావు, షేక్‌ ఎండి సాదిఖ్‌, సిహెచ్‌ సుధలు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

ప్రత్యేక అలంకారంలో నరేంద్రస్వామి

పెదపులివర్రు(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్రస్వామి దేవాలయంలో కార్తిక మాసం బహుళ దశి పురస్కరించుకుని గురువారం స్వామి వారికి 25వ రోజు ప్రాతఃకాలంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే స్వామి వారికి ద్వాదశ హారతులు కొనసాగుతున్నాయి. పూజా కార్యక్రమాలను అర్చకులు ఆమంచి సృజన్‌ కుమార్‌ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలను దేవస్థాన కమిటీ చైర్మన్‌ జంపని అంజయ్య, కార్యనిర్వాహణాధికారి మేకా సాంబశివరావు పర్యవేక్షిస్తున్నారు.

మూడు రోజుల వ్యవధిలో 3,966 మిల్లీమీటర్ల వర్షం

నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎక్కడా వర్షం పడలేదని వాతావరణశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. మిచాంగ్‌ తుఫాన్‌ వల్ల నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆ మూడురోజుల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాల్లో 3,966.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటున ప్రతి మండలంలో 141.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 5న 1,252.4 మి.మీ. వర్షం పడగా 6న 2,713.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. మూడురోజుల వ్యవధిలో చిలకలూరిపేటలో అత్యధికంగా 243.6 మి.మీ. వర్షం పడగా, సత్తెనపల్లిలో 232.0, నరసరావుపేటలో 219.8 మి.మీ. వర్షం కురిసింది. అత్యల్పంగా రెంటచింతలలో 51.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.

యార్డుకు 27,945

బస్తాల మిర్చి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం 27,945 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 26,950 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.10,000 నుంచి రూ.21,300 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.9,500 నుంచి 24,000 వరకు లభించింది.

Advertisement

What’s your opinion

Advertisement