ఆసక్తికరంగా ‘అలంపూర్‌’ రాజకీయం.. బీఫాం ఎవరికో?

4 Nov, 2023 10:38 IST|Sakshi
తనగలలో ఆటోలో వెళ్తున్న కూలీలకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే అబ్రహం- ఉండవెల్లిలో ఇంటింటి ప్రచారం చేస్తున్న విజేయుడు

సాక్షి, జోగుళాంబ గద్వాల: అలంపూర్‌ రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహంకు బీఫామ్‌ ఇంకా అందలేదు. చల్లా వర్గీయుడు విజేయుడు, ఎమ్మెల్యే అబ్రహం వేర్వేరుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో పార్టీ క్యాడర్‌ గందరగోళంలో పడింది. మరో వైపు,తన తనయుడు శ్రీనాథ్‌కు సీట్‌ ఇవ్వాలంటూ మంద జగన్నాథ్‌ పట్టుబడుతున్నారు.

అలంపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున అటు ఎమ్మెల్యే అబ్రహం, ఇటు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు శుక్రవారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బీఫాం విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని, తనకే వస్తుందని, మహిళలు, వృద్ధులు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, తనను ఆదరించాలని ఎమ్మెల్యే అబ్రహం కోరారు.

ఈమేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు ఉండవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యర్థులకు తీసిపోనట్లుగా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది.
చదవండి: ‘కర్ణాటక’ కుట్రపై  అధికారుల అలర్ట్‌!

మరిన్ని వార్తలు